ఇస్రో వేల కోట్లు ఎలా సంపాదిస్తుందంటే..?

14 Dec, 2023 16:59 IST|Sakshi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వివిధ రకాల వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఉపగ్రహ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో రికార్డులు నెలకొల్పుతోంది.

అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గడచిన 4-5 ఏళ్ల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఇస్రో ఎలా డబ్బు సంపాదిస్తుందో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

భారత శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్ధ్యం, ప్యాషన్‌తో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల పురోగతి కుంటుపడిందన్నారు. మోదీ రాకతో ప్రైవేట్ మార్గాల నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి మాట్లాడారు.

నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో సైతం దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతిని నొక్కిచెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. దాంతో డబ్బు సమకూరుతుందని తెలిపారు.

వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా సంపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అనేక దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, యూఎస్‌ఏ వంటి దేశాలకు సర్వీసులు అందించిందని వివరించారు. యూరోపియన్ దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ చెప్పారు.

ఇదీ చదవండి: అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా

గగన్‌యాన్ మిషన్ 2025 ప్రారంభంలో మానవరూప రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని సింగ్ వెల్లడించారు. 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' గురించి సింగ్ మాట్లాడారు. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల గురించి వివరించారు.

>
మరిన్ని వార్తలు