Moody's Analysis On Aadhaar: ఆధార్‌ సురక్షితమేనా.. ఇంతకీ కేంద్రం ఏం చెబుతోంది?

26 Sep, 2023 09:12 IST|Sakshi

గ్లోబుల్‌ క్రెడిట్‌ ఏజెన్సీ మూడీస్‌ ఆధార్‌ కార్డుపై చేసిన వ్యాఖ్యల్ని కేంద్రం ఖండించింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ టెక్నాలజీ విధానంతో ప్రజల భద్రత, గోప్యతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని తప్పు బట్టింది. 

మూడీస్‌ ఆరోపణలపై యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) సైతం స్పందించింది. ఆధారాలు లేకుండా మూడీస్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రపంచంలోనే ఆధార్‌ అంత్యంత నమ్మకమైన డిజిటల్‌ ఐడీ’ అని తెలిపింది. కాబట్టే భారతీయులు 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించారని, దీన్ని బట్టి ఆధార్‌పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అర్ధమవుతుందని మూడీస్‌కు సూచించింది.

అంతర్జాతీయ సంస్థలు ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంకులు ఆధార్‌ విధానాన్ని ప్రశంసించిన అంశాన్ని ఈ సందర్భంగా యూఐడీఏఐ గుర్తు చేసింది. ప్రపంచంలో పలు దేశాలు సైతం ఆధార్‌ తరహాలో తమ దేశంలో డిజిటల్‌ ఐడీ వ్యవస్థను అమలు చేసేలా తమను సంప్రదించినట్లు చెప్పింది. 

ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి బయోమెట్రిక్ టెక్నాలజీలు కాంటాక్ట్‌లెస్‌ అని గుర్తించడంలో మూడీస్‌ విఫలమైందని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, ఆధార్‌ భద్రత విషయంలో మొబైల్‌ ఓటీపీ వంటి సెక్యూరిటీ అంశాలపై ప్రస్తావించడం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ఆధార్ డేటాబేస్ ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది కేంద్రం.

మరిన్ని వార్తలు