జూన్‌ త్రైమాసికంలో వృద్ధి 6.3 శాతంలోపే..: మూడీస్‌

12 Jun, 2023 04:25 IST|Sakshi

ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 6 నుంచి 6.3 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మూడీస్‌ అంచనావేసింది. ప్రభుత్వానికి అంచనాలకన్నా తక్కువ ఆదాయాలు నమోదయ్యే అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గత వారం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వేసిన 8 శాతం అంచనాలకన్నా తాజా మూడీస్‌ అంచనా ఎంతో దిగువన ఉండడం గమనార్హం.

2022–23 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో నమోదయిన 6.1 శాతానికి దాదాపు సరిసమానంగా ఉండడం మరో విశేషం. వ్యవస్థలో అధిక వడ్డీరేట్లు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని కూడా మూడీస్‌  అభిప్రాయపడింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 6.1 శాతం, 6.3 శాతాలుగా నమదవుతాయని మూడీస్‌ అంచనా. మూడీస్‌ భారత్‌కు ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్‌ ఇస్తోంది. ఇది అత్యంత దిగువ ఇన్వెస్ట్‌మెంట్‌ స్థాయి. చెత్త రేటింగ్‌కన్నా ఒక అంచె ఎక్కువ. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజాలు ఫిచ్, ఎస్‌అండ్‌పీ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ ఇస్తున్నాయి.

మరిన్ని వార్తలు