UnionBudget 2023-24: సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ

6 Dec, 2022 08:38 IST|Sakshi
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(ఫైల్‌ ఫోటో)

బడ్జెట్‌పై కేంద్రానికి ఆర్థికవేత్తల విజ్ఞప్తి

పెన్షన్‌ పెంపు, ప్రసూతి ప్రయోజనాలకు తగిన కేటాయింపులకు వినతి   

న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకాల ఆవిష్కరణలపై  2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దృష్టిసారించాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు 51 మంది ప్రముఖ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు.  సామా­జిక భద్రతా పెన్షన్‌లను పెంచాలని, ప్రసూతి ప్రయో జనాలకు తగిన కేటాయింపులను ఈ లేఖలో డిమాండ్‌ చేశారు.

ఈ లేఖపై సంతకం చేసినవారిలో జీన్‌ డ్రేజ్‌ (గౌరవ ప్రొఫెసర్, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌), ప్రణబ్‌ బర్ధన్‌ (ఎమిరిటస్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బర్కిలీ), ఆర్‌ నాగరాజ్‌ (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐజీఐడీఆర్, ముంబై), రీతికా ఖేరా (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌, ఐఐటీ, ఢిల్లీ), సుఖదేయో థోరట్‌ (ప్రొ ఫెసర్‌ ఎమెరిటస్, జేఎన్‌యూ)తదితరులు ఉన్నారు. 

జైట్లీకీ రాశాం... 
‘‘ఇది 20 డిసెంబర్‌ 2017 అలాగే 21 డిసెంబర్‌ 2018 (గత ఆర్థికమంత్రి  అరుణ్‌ జైట్లీని ఉద్దేశించి) నాటి మా లేఖలకు కొనసాగింపు. ఇక్కడ మేము తదుపరి కేంద్ర బడ్జెట్‌ కోసం రెండు ప్రాధాన్యతలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుదల అలాగే ప్రసూ­తి ప్రయోజనాల కోసం తగిన కేటాయింపు’’ అని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.   

‘‘రెండు ప్రతిపాదనలు గత సందర్భాల్లో విస్మరించినందున, మేము మళ్లీ అదే సిఫార్సులతో తదుపరి బడ్జెట్‌కు చాలా ముందుగానే ఈ లేఖను మీకు రాస్తున్నాము’’ అని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జాతీయ వృద్ధాప్య పెన్షన్‌ పథకం (ఎన్‌ఓఏపీఎస్‌) కింద వృద్ధా­ప్య పింఛన్‌లకు (దాదాపు 2.1 కోట్ల మంది పెన్షనర్లకు) కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం 2006 నుండి నెలకు కేవలం రూ.200గానే ఉందని లేఖలో వారు పేర్కొన్నారు. దీనిని తక్షణం రూ.500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే జరిగితే ఈ పథకం కింద అదనంగా రూ.7,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్‌ రూ.300 నుంచి రూ.500కు పెంచాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేశా­రు. దీనికి రూ.1,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి వస్తుందని తెలిపారు. మెటర్నటీ  ప్రయోజ­నాల పెంపునకు రూ.8,000 కేటాయింపులు అవసరమన్నారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి విదితమే.

మరిన్ని వార్తలు