మై హోమ్‌ టర్నోవర్‌ రూ.6 వేల కోట్లు

9 Apr, 2021 05:32 IST|Sakshi

ఈ ఆర్థిక సంవత్సరంలో 10% వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కన్‌స్ట్రక్షన్, సిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్మా రంగాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మై హోమ్‌ గ్రూప్‌.. మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇందులో రూ.3 వేల కోట్లు కన్‌స్ట్రక్షన్స్, రూ.2,500 కోట్ల సిమెంట్‌.. మిగిలినవి ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్మా విభాగాల వాటా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధిని సాధిస్తామని పేర్కొంది. మై హోమ్‌ కంపెనీ ప్రారంభమై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మై హోమ్‌ ఎండీ జూపల్లి శ్యామ్‌ రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 3.5 కోట్ల చదరపు అడుగులలో 25 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేసిన ఘనతను సాధించనున్నామని.. ఇందులో ఇప్పటికే 2.7 కోట్ల చ.అ.లను డెలివరీ చేసేశామని.. మరొక 80 లక్షల చ.అ. నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. అనంతరం మైహోమ్‌ హోల్‌టైం డైరెక్టర్‌ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోకాపేటలో 2.7 కోట్ల చ.అ.లలో ఆసియాలోనే అతిపెద్ద ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ప్రీకాస్ట్‌ కన్‌స్ట్రక్షన్, సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌లతో పాటు బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌ (బీఐఎం) 6డీ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనున్నామని చెప్పారు. అలాగే తెల్లాపూర్‌లో అంకుర పేరిట తొలి విల్లా ప్రాజెక్ట్‌ను, ఇదే ప్రాంతంలో త్రిదాస ప్రీమియం అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను కూడా నిర్మిస్తున్నామన్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో ప్రాజెక్ట్‌ విజిటింగ్‌ నుంచి ఫ్లాట్‌ బుకింగ్, లావాదేవీలు చెల్లింపులు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోల్‌ టైం డైరెక్టర్‌ జూపల్లి వినోద్‌ రావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి రజితా రావు, సీఎఫ్‌ఓ ఏ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు