కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు, మూసివేత దిశగా ఫ్యూచర్‌ రిటైల్‌?

14 Nov, 2023 07:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్‌ రిటైల్‌ను (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కొనుగోలు చేసేందుకు సరైన కొనుగోలుదారుపై రుణదాతలు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో సంస్థ మూసివేత దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి.

సంస్థ లిక్విడేషన్‌ కోసం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ముంబై బెంచ్‌)లో పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) దరఖాస్తు సమర్పించినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ తెలియజేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌కు రూ. 30,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020లో రిలయన్స్‌ రిటైల్‌ ప్రతిపాదించినప్పటికీ .. అమెజాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా రుణదాతలు దాన్ని తిరస్కరించారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌పై 2022 జులై 20 నుంచి దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కార చర్యలకు గడువును ఎన్‌సీఎల్‌టీ నాలుగు సార్లు పొడిగించినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదు. చివరి సారిగా నిర్దేశిత గడువులోగా స్పేస్‌ మంత్ర రూ. 550 కోట్లకు బిడ్‌ వేసినప్పటికీ రుణదాతల కమిటీలో (సీవోసీ) దానికి తగినంత స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో ఎఫ్‌ఆర్‌ఎల్‌ లిక్విడేషన్‌ బాట పట్టనుంది.   

మరిన్ని వార్తలు