50 మంది ఉద్యోగులకు 60 లక్షల షేర్లు

27 Aug, 2020 15:11 IST|Sakshi

పారిశ్రామికవేత్త మిల్టన్‌ ఔదార్యం

న్యూయార్క్‌ : ఉద్యోగులతో పనిచేయించుకుని జీతాలు ఇచ్చే సంస్థలు చాలా ఉన్నా వారి బాగోగులను పట్టించుకునే యజమానులు అరుదుగా కనిపిస్తారు. నికోలా కార్పొరేషన్‌ అధినేత ట్రెవర్‌ మిల్టన్‌ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులపై ఆయనకున్న అభిమానం, విశ్వాసాన్ని వెల్లడించాయి. తన ఎలక్ర్టిక్‌ ట్రక్‌ స్టార్టప్‌లో ముందుగా చేరిన 50 మంది ఉద్యోగులకు తాను చేసిన వాగ్ధానం ప్రకారం తనకు చెందిన 60 లక్షల కంపెనీ షేర్లను వారికి కట్టబెడుతున్నారు. తాను కంపెనీని ప్రారంభించినప్పుడు ప్రపంచంలోనే మెరుగైన ఉద్యోగులను తీసుకోవాలనుకున్నానని, అది తనకు పెనుసవాల్‌గా మారిందని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసిన వీడియోలో పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ తనకు తొలి రోజు నుంచే అసాధారణమైన ఉద్యోగుల బృం‍దం లభించిందని చెప్పుకొచ్చారు.

వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు నా వ్యక్తిగత షేర్ల నుంచి 6,00,000 షేర్లను వారికి అందిస్తున్నానని వెల్లడించారు. దీంతో సంస్థలో తన వాటా తగ్గుతుంది.. అయినా వాటిని విక్రయించకుండా ఉద్యోగులకు ఇస్తున్నానని తెలిపారు. ఉద్యోగులకు మిల్టన్‌ ఇస్తున్న షేర్ల విలువ ప్రస్తుతం 233 మిలియన్‌ డాలర్లు. జూన్‌లో రివర్స్‌ మెర్జర్‌ ద్వారా నాస్డాక్‌లో నికోలా ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి షేర్‌ విలువ భారీగా పెరిగింది. హైస్కూల్‌ విద్యనూ దాటని మిల్టన్‌ పట్టుదలతో వాణిజ్యవేత్తగా ఎదిగారు. తన సంస్థ ఉన్నతికి సోషల్‌ మీడియాను సమర్ధంగా వాడుకున్న మిల్టన్‌ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఐదవ వ్యక్తిగా నిలిచిన ఎలన్‌ మస్క్‌తో పోల్చుతారు. 37 ఏళ్ల మిల్టన్‌ 460 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలో 500 సంపన్నుల్లో చోటు దక్కించుకున్నారు. అయితే షేర్ల బదిలీ జరిగితే ఈ జాబితాలో ఆయన ర్యాంక్‌ పతనమయ్యే అవకాశం ఉంది. చదవండి : టెకీలకు యాక్సెంచర్ షాక్‌..

మరిన్ని వార్తలు