Toyota Innova Flex Fuel MPV: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!

29 Aug, 2023 17:48 IST|Sakshi

భారతదేశం అభివృద్ధివైపు వేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఈ రోజు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని ఆవిష్కరించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎల‌క్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయ‌ల్ పుట్టుకొచ్చింది.

టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్‌తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్‌లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ పనితీరు అద్భుతంగా ఉంటుంది.

ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ..
ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్‌ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి.

ఇదీ చదవండి: ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్‌లో కస్టమర్లు - కారణం ఇదే!

ఇథనాల్..
ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ రకమైన కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు