5-రోజులు ఆఫీస్‌ విధానం చచ్చింది: ప్రముఖ బిలియనీర్‌ కీలక వ్యాఖ్యలు

30 Oct, 2023 21:18 IST|Sakshi

దేశంలో ఉత్పాదకత మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా ప్రస్తుత పని ఉత్పాదకతపై చర్చ సాగుతోంది.

ఈ విషయంపై తాజాగా తన అభిప్రాయాలను పంచుకున్న ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా.. నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ఏ ఉద్యోగి ఎన్ని గంటలు పని చేస్తున్నారన్నదానిపై పట్టింపు లేదని, వారి ఆశయం, లక్ష్యం, ఎంత సాధించారన్న దానినే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

వర్తమానం, భవిష్యత్‌ హైబ్రిడ్ వర్క్‌దే..
పనిలో పనిగా వారానికి ఐదు రోజుల ఆఫీస్‌ వర్క్‌ విధానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు హర్ష్‌ గోయెంకా. ఐదు రోజుల ఆఫీస్‌ విధానం ముగిసిన అధ్యాయం.. వర్తమానం, భవిష్యత్‌ హైబ్రిడ్ వర్క్‌ విధానానిదే అని పేర్కొన్నారు. "వారానికి 5 రోజుల ఆఫీస్ విధానం చచ్చింది. హైబ్రిడ్ వర్క్‌ విధానానిదే వర్తమానం, భవిష్యత్తు" అని రాసుకొచ్చారు.

(టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) 

కరోనా మహమ్మారి వివిధ రంగాలలో ఉద్యోగుల పని విధానాన్ని మార్చివేసిందనడంలో సందేహం లేదు. కానీ మహమ్మారి ప్రభావం ఇప్పుడు గణనీయంగా తగ్గడంతో, కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలవడం ప్రారంభించాయి. హైబ్రిడ్ లేదా ఆన్-సైట్ మోడల్ వర్క్‌ను అనుసరిస్తున్నాయి.

జెరోధా సీటీవో కైలాష్ నాధ్ ఇటీవల మాట్లాడుతూ వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని తొలగించడం అంత సులువు కాదన్నారు. అయితే తమ ఉద్యోగులు ఇంటి దగ్గర కంటే ఆఫీసు నుంచి పని చేయడం ద్వారా పనులను వేగంగా పూర్తి చేయగలిగారని చెప్పారు.

(భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్‌ టెక్‌.. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థతో..)

మరిన్ని వార్తలు