ఐపీవోకు నోవా అగ్రిటెక్‌

7 Mar, 2023 06:10 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ నోవా అగ్రిటెక్‌ ఐపీవోకు రానుంది. ఐపీవోలో భాగంగా రూ.140 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్‌ నూతలపాటి వెంకట సుబ్బారావు 77.58 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నారు.

అయితే ఓఎఫ్‌ఎస్‌ ద్వారా ఒక్కో షేరును ఎంతకు ఆఫర్‌ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కంపెనీలో ఆయనకున్న మొత్తం వాటా 11.9 శాతం విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ కంపెనీ నోవా అగ్రి సైన్సెస్‌ ద్వారా కొత్త ఫార్ములేషన్‌ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాంటు విస్తరణకు సైతం ఖర్చు చేస్తారు. కంపెనీ షేర్లను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్ట్‌ చేయనుంది.

మరిన్ని వార్తలు