ఒబెరాయ్‌ రియల్టీ జూమ్‌- ర్యాలీస్‌ డౌన్‌

20 Oct, 2020 13:25 IST|Sakshi

ద్వితీయార్థ పనితీరుపై ఆశావహ అంచనాలు

15 శాతం దూసుకెళ్లిన ఒబెరాయ్‌ రియల్టీ షేరు

క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు

5.5 శాతం పతనమైన ర్యాలీస్‌ ఇండియా షేరు

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 238 పాయింట్లు జంప్‌చేసి 40,669ను తాకింది. నిఫ్టీ 56 పాయింట్లు ఎగసి 11,929 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై మెరుగైన పనితీరు ప్రదర్శించనుందన్న అంచనాలు ఒబెరాయ్‌ రియల్టీ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెస్టెంబర్‌) ఫలితాలు నిరాశపరచడంతో ర్యాలీస్‌ ఇండియా కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఒబెరాయ్‌ రియల్టీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ర్యాలీస్‌ ఇండియా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

ఒబెరాయ్‌ రియల్టీ
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఒబెరాయ్‌ రియల్టీ నిర్వహణ లాభం(ఇబిటా) 12 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 36 శాతం నీరసించి రూ. 316 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు భారీగా జంప్‌చేసి 59 శాతాన్ని తాకాయి. పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి కంపెనీ పనితీరు జోరందుకునే వీలున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. థానే తదితర ప్రాంతాలలో ప్రాజెక్టులు ఇందుకు సహకరించగలవని అంచనా వేసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఒబెరాయ్‌ రియల్టీ షేరు తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 446ను తాకింది. ప్రస్తుతం 13 శాతం లాభంతో రూ. 440 వద్ద ట్రేడవుతోంది.  

ర్యాలీస్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ర్యాలీస్‌ ఇండియా నికర లాభం 2 శాతం తగ్గి రూ. 83 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 725 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16.1 శాతం వద్ద స్థిరత్వాన్ని చూపాయి. అమ్మకాలలో దేశీయంగా సస్యరక్షణ విభాగం 8 శాతం, విత్తనాల బిజినెస్‌ 29 శాతం పుంజుకున్నప్పటికీ.. ఎగుమతులు 29 శాతం క్షీణించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీస్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 5.5 శాతం పతనమై రూ. 259 దిగువకు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 263 వద్ద ట్రేడవుతోంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా