ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్‌ స‍్కూటర్‌ వైరల్‌!

23 Dec, 2022 17:18 IST|Sakshi

కార్పోరేట్‌ ప్రపంచంలో బ్రాండ్‌  వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోయిందా ఇక అంతే సంగతులు. అందుకే కార్పొరేట్‌ కంపెనీలు కోట్లు కుమ్మురించి బ్రాండ్‌ వ్యాల్యూని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ళ వరకు తన స్ట్రాటజీతో మార్కెట్‌లో బ్రాండ్‌ను క్రియేట్‌ చేయడంలో ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ సమర్ధుడు.  

ఓలా! ఈవీ మార్కెట్‌లో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎన్నో కంపెనీలు ప్రయత్నించినా.. ఓలా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. లక్ష రూపాయలు చెల్లించి.. స్కూటర్‌ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఓలా వెహికల్స్‌లో లోపాలు తలెత్తాయి. ఆర్‌ అండ్‌ డీ మీద దృష్టి సారించకుండా నాసిరకం వెహికల్స్‌ తయారు చేశారంటూ కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెహికల్‌తో పెట్టుకుంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి.  

దీంతో రంగంలోకి దిగిన భవిష్‌ అగర్వాల్‌ బ్రాండ్‌ను, ప్రొడక్ట్‌ వ్యాల్యూలో మార్పులు చేశారు. తయారీలో రాజీపడకుండా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.  మరోవైపు స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకో రకంగా వివరిస్తున్నారు. తాజాగా ఓలా స్కూటర్‌ను ఎలా క్రియేటీవ్‌గా వినియోగించుకోవచ్చో తెలుపుతూ ఓ వీడియోని షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఓలా స్పీకర్లను ఉపయోగించి ఓ యువకుడు లైవ్ క్రికెట్ కామెంటరీ ఇవ్వడం నెటిజన్లను విపరీంగా ఆకట్టుకుంటుంది. 

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతంలో యువకులు గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే గ్రౌండ్‌ సమీపంలో పార్క్‌ చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వైర్‌లెస్‌ స్పీకర్‌ ఫీచర్‌ సాయంతో ఆ వెహికల్‌ పక్కనే యువకుడు ఫోన్‌లో క్రికెట్‌ కామెంటరీ ఇవ్వడం వైరల్‌గా మారింది. 

ఆ వీడియోను షేర్‌ చేసిన భవిష్‌.. మా వెహికల్‌ను అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకోవడం తొలిసారి చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు.  ఓ నెటిజన్‌ భవీష్‌ ఇది ఇండియా.. ఇక్కడ అన్నీ సాధ్యమేనని ట్వీట్‌ చేస్తుంటే.. ఆటోమొబైల్‌ మార్కెట్‌లో తయారీ దారులకు గేమ్‌ ఛేంజర్‌ వెహికల్‌ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి

మరిన్ని వార్తలు