ఓఎన్‌డీసీ @50 లక్షల లావాదేవీలు

19 Dec, 2023 07:23 IST|Sakshi

యారీ యాప్ ఆవిష్కరణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌లో కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానించే ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌)లో లావాదేవీల సంఖ్య ఈ డిసెంబరు ఆఖరు కల్లా నెలకు 50 లక్షల స్థాయికి చేరనున్నాయి. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ఇవి 70 లక్షలకు చేరే అవకాశం ఉందని సంస్థ ఎండీ టి. కోషి తెలిపారు. 

ఈ ఏడాది తొలినాళ్లలో లావాదేవీలు కొద్ది వేల సంఖ్యలో మాత్రమే ఉండేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఓఎన్‌డీసీలో దాదాపు 40 యాప్‌లు ఉన్నట్లు వివరించారు. నిత్యావసరాలు, ఫ్యాషన్‌ మొదలైనవి ఉండగా, వాటితో పాటు కొత్తగా ఆర్థిక సేవలు, ఇతరత్రా సర్వీసులను కూడా ఓఎన్‌డీసీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోమవారమిక్కడ ఆటో, క్యాబ్‌ సేవల యాప్‌ యారీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన చెప్పారు.  

హైదరాబాద్‌లో వాహన సేవల రంగాన్ని పునర్నిర్వంచేలా తమ యాప్‌ ఉంటుందని యారీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు హరిప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న యాప్‌లకు భిన్నంగా సున్నా కమీషన్‌ ప్రాతిపదికన దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. రోజుకు అయిదు ట్రిప్‌లు దాటితే డ్రైవర్లు నామమాత్రంగా రూ. 25 చెల్లిస్తే సరిపోతుందన్నారు. 

ఇందులో ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రకారం చార్జీలు ఉంటాయని, కస్టమర్లు చెల్లించే మొత్తం డబ్బు డ్రైవర్లకు వెడుతుందని హరిప్రసాద్‌ వివరించారు. హైదరాబాద్‌తో ప్రారంభించి వచ్చే 6 నెలల్లో 4 నగరాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 12,000 పైచిలుకు డ్రైవర్ల ఆన్‌బోర్డింగ్‌ ప్రక్రియ పూర్తయిందని, 20,000 మంది డ్రైవర్లు ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. హరిప్రసాద్, మదన్‌ బాలసుబ్రమణియన్, పరితోష్‌ వర్మ కలిసి యారీని ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు