డ్రగ్‌ పెడ్లర్‌గా మారిన భగ్న ప్రేమికుడు! 

19 Dec, 2023 02:39 IST|Sakshi

తొలుత డ్రగ్స్‌కు బానిసగా.. ఆ తర్వాత పెడ్లర్‌గా..

గోవా, బెంగళూర్‌ నుంచి కొనుగోళ్లు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు విక్రయం

స్నేహితుడితో కలిసి నెల్లూరుకు చెందిన ఓ యువకుడి నిర్వాకం

గుట్టురట్టు చేసిన టీఎస్‌–నాబ్‌ అధికారులు

14 మంది అరెస్టు.. 42 ఎక్స్‌టసీ పిల్స్‌ స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమై డిప్రెషన్‌లో మాదకద్రవ్యాలకు అలవా­టు­ప­డ్డాడు. స్నేహితుడి సలహా మేరకు డ్రగ్‌ పెడ్లర్‌గా మారి హైదరాబాద్‌తో పాటు నెల్లూరు­కు చెందిన  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లకు సరఫరా చేయడం మొదలె­ట్టాడు. ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌­మెంట్‌ బ్యూరో (టీ­ఎస్‌–నా­బ్‌) అతనితో సహా 14 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి 42 ఎక్స్‌టసీ పిల్స్‌ స్వాధీ­నం చేసుకుంది.  

చేస్తున్న ఉద్యోగాలు మానేసి.. 
నెల్లూరులోని ఫతేఖాన్‌పేటకు చెందిన జె.ఆషిక్‌ యాదవ్‌  గతంలో బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇతడు బీటెక్‌ చదువుతున్న రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ఓ యువతి కూడా ఉన్నత చదువుల కోసం అక్కడికే రావడంతో ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే ఇద్దరి మధ్యా వివాదాలు ఏర్పడటంతో ఆమె ఆషిక్‌కు దూరమైంది.

దీంతో తీవ్ర డిప్రెషన్‌కు గురైన ఆషిక్‌ మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. బెంగళూరు, గోవాలకు చెందిన డ్రగ్స్‌ సప్లయర్స్‌ నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసి వినియోగించే వాడు. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన ఆషిక్‌ నానక్‌రామ్‌గూ­డలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో నెలకు రూ.22 వేల జీతం వస్తున్నా సరిపోకపోవడంతో గత జూన్‌లో ఆ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు.

మనమే ఆ దందా చేద్దామంటూ..
ఈ క్రమంలో  నెల్లూరుకే చెందిన ఇతని క్లాస్‌మే­ట్‌ రాజేష్‌ వ్యాపార నిమిత్తం ఆగస్టులో హైద­రాబాద్‌ వచ్చాడు. డ్రగ్స్‌ వినియోగించే అలవా­టు ఉన్న ఇతడు ఆషిక్‌ నుంచి వాటిని తీసుకునే వాడు. నగరంలో మాదకద్రవ్యాలకు ఉన్న డిమాండ్‌ గుర్తించిన రాజేష్‌ తామే ఆ దందా చేద్దామని, మార్కెట్‌లో ఎక్స్‌టసీ పిల్స్‌కు మంచి డిమాండ్‌ ఉందని, వాటినే తీసుకువచ్చి విక్రయిద్దామని చెప్పాడు.

దీంతో గోవాకు చెందిన తన స్నేహితుడు బాబాతో పాటు బెంగళూరుకు చెందిన సాయి చరంద్‌ నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేస్తున్న ఆషిక్‌ వాటిని నగరానికి తీసుకువచ్చి రాజేష్‌కు అప్పగిస్తున్నాడు. ఇతడు నగరంతో పాటు నెల్లూరులోని తన స్నేహితులు, రెగ్యులర్‌ కస్టమ­ర్లకు వీటిని విక్రయిస్తున్నాడు. అక్కడ ఒక్కో ఎక్స్‌టసీ పిల్‌ను రూ.1000కి ఖరీదు చేసి... ఇక్కడ రూ.3 వేలకు అమ్ముతు న్నారు.

 గత మంగళవారం గోవా వెళ్లిన ఆషిక్‌ అక్కడ బాబాకు రూ.60 వేలు చెల్లించి 60 ఎక్స్‌టసీ పిల్స్‌ ఖరీదు చేసుకువచ్చాడు. వీటిని తన వద్ద ఉంచుకున్న రాజేష్‌... శనివారం రెండు పిల్స్‌ను ఆషిక్‌కు ఇచ్చి తమ కస్టమర్లకు అందించమని చెప్పాడు. ఇతడి కదలికలపై టీఎస్‌–నా­బ్‌కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శనివారం ఉదయం అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద ఆషిక్‌ను పట్టుకుని రెండు పిల్స్‌ స్వాధీనం చేసుకుంది.

అతడిచ్చిన సమాచారంతో సోమ వారం ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ పై దాడి చేసింది. అక్కడ రాజేష్‌తో పాటు 12 మంది చిక్కారు. వీరికి డ్రగ్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వీరి నుంచి మరో 40 పిల్స్‌ స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసింది. ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది.

డ్రగ్స్‌తో అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌లో రేవ్‌ పార్టీలు
డ్రగ్స్‌ ఖరీదు చేసిన కొందరు గతంలో అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ల్లోని సర్వీస్‌ అపా­ర్ట్‌మెంట్స్‌లో రేవ్‌ పార్టీలు చేసుకున్నట్లు ఆధా­రాలు లభించాయి. ఓ బర్త్‌డే పార్టీతో పాటు న్యూ ఇయర్‌ వేడుకల కోసం కొందరు వీరి నుంచి ఈ పిల్స్‌ ఖరీదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. టీఎస్‌–నాబ్‌ అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌­నగర్‌ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. 

నిందితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు
ఆషిక్, రాజేష్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషించిన పోలీసులు రెగ్యులర్‌గా డ్రగ్స్‌ ఖరీదు చేసే 33 మందిని గుర్తించారు. వీరి వద్ద ఈ డ్రగ్‌ కొనుగోలు చేస్తున్న వారిలో నెల్లూరుకు చెందిన సంపత్, నిహార్, మోహిత్, అశోక్, అమిత్, జై, వసీమ్, ఫయాజ్, శ్రీరామ్, గౌతమ్, గిరిధర్, హనీష్, వేలాసరి, డాక్టర్‌ పునీత్, డాక్టర్‌ అరుణ్‌ మత్, డాక్టర్‌ ప్రశాంత్, నగరానికి చెందిన శ్రీరామ్, హృతిక్‌ ఉన్నారు. వీరిలో కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కాగా మిగిలిన వాళ్లు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు డాక్టర్లు. 

>
మరిన్ని వార్తలు