ట్యాక్స్‌ ఆడిటింగ్‌.. సకాలంలో రిపోర్టు సమర్పించకపోతే భారీ పెనాల్టీలు, ఎంతంటే?

19 Sep, 2022 08:37 IST|Sakshi

ఇప్పుడు ప్రపంచమంతటా వినబడే మాట ఆడిటింగ్‌. ప్రతి వ్యవహారాన్ని నిర్వహించిన తర్వాత చెక్‌ చేస్తున్నారు. తనిఖీ అనుకోండి .. సమీక్ష అనుకోండి.. శోధన అనుకోండి. ప్రతి చట్టంలోనూ ‘‘ఆడిటింగ్‌’’ చేయాలని చెబుతున్నారు. అలా ఆదాయపు చట్టంలో కూడా ఒక ఆడిట్‌ ఉంది. దాని పేరు ‘‘ట్యాక్స్‌ ఆడిట్‌’’. కొన్ని నిబంధనల ప్రకారం వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయించాలి.  

ఎందుకు చేయించాలి? 
అసెసీలు సరైన బుక్స్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ నిర్వహిస్తున్నారా లేదా? సరిగ్గా అన్నీ క్లెయిమ్‌ చేస్తున్నారా లేదా? మోసపూరితమైన వ్యవహారాలు జరిగాయా? అనేది చూసేందుకు దీన్ని నిర్దేశించారు. బుక్స్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ సక్రమంగా నిర్వహించడం వల్ల ఆదాయపు అధికారులకు పని ఒత్తిడి తగ్గుతుంది. టైమ్‌ వృధా కాదు. 

ఈ ఆడిట్‌ ఎవరు చేస్తారు.. 
ప్రాక్టీస్‌ చేస్తున్న సీఏలు మాత్రమే ఈ ఆడిట్‌ చేయాలి. తర్వాత వారు రిపోర్టును ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ రూపంలో ఇవ్వాలి.  

ఈ ఆడిట్‌ ఎవరు చేయించాలి.. 
ఒక వ్యాపారి అమ్మకాలు, టర్నోవరు, స్థూల వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి దాటితే ఆడిట్‌ చేయించాలి. వృత్తి నిపుణులైతే వారి వార్షిక వసూళ్లు రూ. 50 లక్షలు దాటితే ట్యాక్స్‌ ఆడిట్‌ చేయించాలి. వ్యాపారస్తులు రూ. 1 కోటి దాటినా, రెండు కోట్ల లోపల ఉంటే నిర్దేశించిన శాతం మేరకు ‘‘లాభ’’ శాతం ఆదాయంగా డిక్లేర్‌ చేస్తే ట్యాక్స్‌ ఆడిట్‌ వర్తించదు. అంతే కాకుండా రూ. 10 కోట్ల లోపు టర్నోవరు ఉన్నవారికి వారి నగదు వ్యవహారాలు – వసూళ్లు – చెల్లింపులు టర్నోవరులో 5 శాతం దాటకపోతే వారికీ మినహాయింపు ఉంది. దీనర్థం ఏమిటంటే నగదు వ్యవహారాలను కట్టిపెట్టి అంతా బ్యాంకు ద్వారా చేయించడమే. 

ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ అంటే.. 
ఇది ఆడిట్‌ రిపోర్ట్‌ ప్రొఫార్మా. దీని ప్రకారం అన్ని విషయాలు తెలియజేయాలి. ఇందులో వంద పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అమ్మకాలు, ఆదాయాలు, అప్పులు, ఆస్తులు, చెల్లింపులు, ఖర్చులు ఇలా అన్నీ ఎంతో వివరంగా ఇవ్వాలి. పూర్తిగా ఇవ్వాలి. వివరణ, విశ్లేషణ ఉంటాయి. తప్పులు, ఒప్పులు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు.. ఒకటేమిటి అన్నింటినీ డేగకన్నుతో చూస్తారు.  

సెప్టెంబర్‌ 30 ఆఖరు తేదీ.. 
ఈ ఆడిట్‌ రిపోర్టును సమర్పించడానికి గడువు తేదీ ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30. ఆడిట్‌ రిపోర్టుతో పాటు రిటర్నులు కూడా సమర్పించాలి. అన్నింటికీ గడువు తేదీ సెప్టెంబర్‌ 30. గత సంవత్సరంలో ఈ గడువుని పొడిగిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పొడిగించరండి! 

భారీ– భారీ పెనాల్టీలు వడ్డిస్తారు.. 
సకాలంలో ఆడిట్‌ రిపోర్టు సమర్పించకపోతే పెనాల్టీ వడ్డిస్తారు. రూ. 1,50,000 లేదా టర్నోవరు మీద 5 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం వడ్డిస్తారు. వడ్డించే ముందు మర్యాదపూర్వకంగా పిలిచి అన్ని వివరాలూ అడిగి, ఆలస్యానికి కారణం సమంజసమేనని అనిపిస్తే వడ్డించరు. లేదంటే వడ్డన తప్పదు.

చదవండి: టెన్షన్‌ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్‌ వైరస్‌.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులూ జాగ్రత్త!

మరిన్ని వార్తలు