ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్

24 Oct, 2023 16:48 IST|Sakshi

ఆదాయపుపన్ను కట్టనివారిపై సంబంధిత శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ‘360డిగ్రీ ప్రొఫైలింగ్‌’ ద్వారా అపరకుబేరులు కట్టే పన్ను ఎగవేతను అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. 

గడిచిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యూవల్స్‌) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

రూ.1కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను '360-డిగ్రీల ప్రొఫైలింగ్' చేయనున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్‌, ఖర్చులు, అసెస్‌మెంట్ కోసం ఆదాయ వనరులను ట్రాక్ చేస్తోందని వెల్లడించారు.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌ల్లో రూ.ఒక కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఐటీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు