ఆక్స్‌ఫామ్‌ భారత్‌: 55.5 కోట్ల మంది దగ్గర ఎంత ఉందో.. ఆ 98 మంది దగ్గర అంతే డబ్బుంది!! ఏమేం చేయొచ్చో తెలుసా?

17 Jan, 2022 14:47 IST|Sakshi

కరోనా మహమ్మారి కోరలు చాచిన రెండేళ్లలో (2020, 2021) సంవత్సరాల్లో..  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల సంపద రెట్టింపైనట్టు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రకటించింది. Oxfam Davos 2022 నివేదిక ప్రకారం.. అంతకుముందు 14 ఏళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా టైంలోనే ఇది మరింతగా వృద్ధి చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది. అదే సమయంలో పేదరికం, అసమానతలు తారాస్థాయికి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది.


బిలియనీర్‌.. బిలియన్‌ డాలర్‌, అంతకు మంచి సంపద ఉన్నవాళ్లు.  2021లో భారత్‌ విషయానికొస్తే బిలియనీర్ల సంపద రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి.. 142 మందికి చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 40 మంది బిలియనీర్లు చేరారు!. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021లో 142 మంది భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు.  అంటే.. దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలకుపైనే.  దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది.  


భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది.  

భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. 

► రెండో వేవ్‌ ఇన్‌ఫెక్షన్‌ టైంలో ఆరోగ్య మౌలిక వసతులు, అంత్యక్రియలు, శ్మశానాలే ప్రధానంగా నడిచాయి. 

► భారత్‌లో అర్బన్‌ అన్‌ఎంప్లాయిమెంట్‌ విపరీతంగా పెరిగిందని(కిందటి మేలో 15 శాతం), ఆహార అభద్రత మరింత క్షీణించింది.

► సంపద పునఃపంపిణీ పాలసీలను సమీక్షించాలని గ్లోబల్‌ ఆక్స్‌ఫామ్‌ దావోస్‌ నివేదిక భారత ప్రభుత్వానికి సూచిస్తోంది.

 

గౌతమ్‌ అదానీ.. భారత్‌లో అత్యధికంగా అర్జించిన వ్యక్తిగా ఉన్నారని, ప్రపంచంలోనే ఈయన స్థానం ఐదుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ చెబుతోంది. అదానీ 2021 ఏడాదిలో 42.7 బిలియన్‌ డాలర్ల సంపదను జత చేసుకున్నట్లు.. మొత్తం 90 బిలియన్‌ డాలర్ల సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముకేష్‌ అంబానీ 2021లో 13.3 బిలియన్‌ డాలర్లు వెనకేసుకోగా.. ఈయన మొత్తం సంపద విలువ 97 బిలియన్‌డాలర్లకు చేరింది.


ప్రపంచంలోనే.. 

ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్జీ బ్రిన్, మార్క్‌ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది.

ఈ పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా, సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.

అసమానతలు కరోనా సమయంలో ఎంతలా విస్తరించాయంటే.. ఆరోగ్య సదుపాయాల్లేక, ఒకవేళ ఉన్నా అవి అందుబాటులోకి రాక రోజూ 21,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు.

కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి.  

స్టాక్‌ ధరల నుంచి.. క్రిప్టో, కమోడిటీస్‌ అన్నింటి విలువా పెరుగుతూ వస్తోంది.

ప్రపంచంలోని 500 మంది ధనికులు 1 ట్రిలియన్‌ డాలర్ల సంపదను వెనకేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ చెబుతోంది.

మరిన్ని వార్తలు