భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్‌ - కొత్త ఉత్పత్తుల విడుదలకు సన్నాహాలు!

13 Jun, 2023 07:07 IST|Sakshi

ఐదేళ్లలో రూ. 5,000 కోట్ల నిర్వహణ లాభం

రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ సాధనపై కన్ను

పలు కొత్త ప్రొడక్టుల విడుదలకు ప్రణాళికలు  

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌ భారీ లక్ష్యాలపై దృష్టి పెట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 5,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాలని చూస్తోంది. ఈ బాటలో రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌ఎంసీజీ బిజినెస్, ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్స్‌ ద్వారా లక్ష్యాలను సాధించాలని ఆశిస్తోంది. 

గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీ ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ విభాగాలను భారీ వృద్ధి బాట పట్టించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ రామ్‌దేవ్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రుచీ సోయాను 2019 సెప్టెంబర్‌లో దివాలా పరిష్కారంలో భాగంగా పతంజలి గ్రూప్‌ టేకోవర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్స్‌ను సైతం భారీ స్థాయిలో పెంచేందుకు వీలుగా ఐదేళ్ల విజన్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు రామ్‌దేవ్‌ వెల్లడించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్‌ బిజినెస్‌లో భారీ కంపెనీగా ఆవిర్భవించాలని లక్షిస్తున్నట్లు తెలియజేశారు.


 
గతేడాది ఓకే 
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కంపెనీ రూ. 886 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 806 కోట్ల నికర లాభం నమోదైంది. ఇబిటా రూ. 1,577 కోట్లుకాగా.. మొత్తం ఆదాయం రూ. 24,284 కోట్ల నుంచి రూ. 31,821 కోట్లకు జంప్‌ చేసింది. దీనిలో వంట నూనెల విభాగం నుంచి రూ. 25,253 కోట్లు లభించింది. వీటి ద్వారా 2021–22లో రూ. 22,469 కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది.

(ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?)

ఇక ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ టర్నోవర్‌ దాదాపు నాలుగు రెట్లు ఎగసి రూ. 6,218 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది కేవలం ఈ విభాగపు ఆదాయం రూ. 1,683 కోట్లకే పరిమితమైంది. కాగా.. తాజా లక్ష్యాలను చేరుకునేందుకు పలు కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు రామ్‌దేవ్‌ తెలియజేశారు. గేదె నెయ్యి, ప్రీమియం విభాగంలో బిస్కట్లు, కుకీస్, డ్రై ఫ్య్రూట్స్, మసాలా దినుసులతోపాటు పౌష్టికాహార ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వివరించారు. 

కంపెనీ ఇప్పటికే పలు రాష్ట్రాలలో 39,000 మందికిపైగా రైతుల ద్వారా 63,816 హెక్టార్లకుపైగా ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ రుచీ గోల్డ్, మహాకోష్, సన్‌రిచ్, న్యూట్రెలా, రుచీ సన్‌లైట్‌ తదితర బ్రాండ్లను కలిగి ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 81 శాతం వాటా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో పతంజలి ఫుడ్స్‌ షేరు 1 శాతం క్షీణించి రూ. 1,014 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు