చిన్న తప్పుకు భారీ మూల్యం చెల్లించుకున్న వొడాఫోన్ ఐడియా

13 Sep, 2021 20:05 IST|Sakshi

జైపూర్: డాక్యుమెంట్లను సరిగ్గా ధృవీకరించకుండా టెలికాం కంపెనీ వేరే వ్యక్తి మొబైల్ నంబర్‌ను మరో వ్యక్తికి జారీ చేయడంతో రూ.27,53,183 పరిహారం చెల్లించాలని రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ శాఖ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ను ఆదేశించింది. అయితే, పాత వ్యక్తి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ ఖాతాకు ఈ నెంబర్ లింకు చేసింది. దీంతో కొత్త సిమ్ తీసుకున్న వ్యక్తి మొదటి కస్టమర్ ఖాతా నుంచి రూ.68 లక్షలు విత్ డ్రా చేశాడు. సరైన వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా వొడాఫోన్ ఐడియా జారీ చేసిన డూప్లికేట్ సిమ్ కార్డు వల్ల ఇదంతా జరిగింది అని మొదటి వ్యక్తి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ విషయం బయట పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మే 2017లో కృష్ణ లాల్ నైన్ అనే వొడాఫోన్ ఐడియా యూజర్ మొబైల్ నంబర్ అనుకోకుండా ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత అతను హనుమాన్ ఘర్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, అతనికి కొత్త సిమ్ అయితే వచ్చింది కానీ, అది యాక్టివ్ కాలేదు. మళ్లీ అతను ఈ విషయం గురించి జైపూర్ వొడాఫోన్ ఐడియా స్టోర్ కు వెళ్లి నంబర్ యాక్టివేట్ చేసుకున్నాడు. అప్పటికే ఐదు రోజులు గడిచాయి. ఈ మధ్య కాలంలో అదే నెంబర్ తో వేరే సిమ్ ఇంకొక కస్టమరుకు బదిలీ చేశారు. దీంతో ఆ కస్టమరు ఈ నెంబర్ సహాయంతో డబ్బును అక్రమంగా బదిలీ చేశారు. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ అలర్ట్!)

అయితే, కృష్ణ లాల్ అనే వ్యక్తి తన మొబైల్ నెంబరు యాక్టివేట్ చేసినప్పుడు డబ్బు బదిలీ గురించి మెసేజ్ రావడంతో తర్వాత అతను ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. పోలీసులు నిందితులను పట్టుకొని ఫిర్యాదుదారుడికి రూ.44 లక్షలు తిరిగి ఇప్పించారు. కానీ, మిగతా రూ.27.5 లక్షలు చెల్లించలేదు. దీంతో న్యాయనిర్ణేత అధికారి వొడాఫోన్ ఐడియాను దోషిగా నిర్ధారించారు. కృష్ణ లాల్ కు ఈ మొత్తాన్ని చెల్లించాలని సంస్థను ఆదేశించారు.

"వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలో రూ.27,53,183ను ఒక నెలలోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో వార్షికానికి 10 శాతం చక్రవడ్డీతో చెల్లించాలని" ఆర్డర్ పేర్కొంది. ఐటీ శాఖ న్యాయనిర్ణేత అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ గుప్తా సెప్టెంబర్ 6న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. చెల్లింపు చేసేందుకు టెల్కోలకు ఒక నెల సమయం ఇచ్చారు. అయితే, ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు బ్యాంక్ ఖాతాదారులను హెచ్చరిస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు