పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!

6 Mar, 2022 16:43 IST|Sakshi

పూణే: హైదరాబాద్ నగరానికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ కంపెనీ తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా, పూణేలోని బనర్ ప్రాంతంలో నిర్మించిన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్ కేంద్రాన్ని కూడా మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించినట్లు ఈ-బస్సుల తయారీసంస్థ ఒలెక్ట్రా గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒలెక్ట్రా ప్రస్తుతం పూణే మహానగర్ పరివర్తన్ మహామండల్ లిమిటెడ్(పిఎమ్ పిఎంఎల్) కోసం నగరంలో 150 ఈ-బస్సులను నడుపుతోంది. 

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్'లో భాగమైన ఈ సంస్థ పూణేతో పాటు సూరత్, ముంబై, సిల్వాస్సా, గోవా, నాగ్ పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్ నగరాలలో తన సేవలను అందిస్తుంది. ఈ బస్సుల పట్ల మెట్రో నగరాల్లోని ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు రవాణా సంస్థలు తమకు తెలిపాయని సంస్థ పేర్కొంది. "పూణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 150 బస్సులకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను జోడించడం ఒలెక్ట్రాకు గర్వంగా ఉంది. సమర్థవంతమైన ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒలెక్ట్రా కట్టుబడి ఉంది" అని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు.

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు ఛార్జ్‌కి 250-300 కిలోమీటర్ల అద్భుతమైన పరిధిని అందిస్తుంది. Olectra C9 3000 ఎన్ఎమ్ టార్క్‌, 480 బీహెచ్ పి పవర్ ఉత్పత్తి చేయగలవు. ఇవి రెండు 180 kW లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో లభించే ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2-3 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఒకేసారి 45-49 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. సుదూర ప్రయాణానికి ఇది సరైన బస్సు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటివి కెమెరాలను కూడా ఉన్నాయి, ప్రతి సీటుకు అత్యవసర బటన్, యుఎస్బి సాకెట్ కూడా ఉంది. 

(చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు)

మరిన్ని వార్తలు