ఈ తరహా కార్లను కొనేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు..ఎందుకంటే

25 Dec, 2021 08:13 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పాత కార్ల మార్కెట్‌ 2025–26 నాటికి దేశంలో 82 లక్షల యూనిట్లకు చేరుతుందని గ్రాంట్‌ థాంటన్‌ భారత్‌ తన నివేదికలో తెలిపింది. ‘2020–21లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లుగా ఉంది. 

చిన్న పట్టణాల నుంచి డిమాండ్, నూతన వాహనాల ధరలు పెరుగుతుండడం, వినియోగదార్లలో వస్తున్న ధోరణి వెరశి పాత కార్ల జోరుకు కారణం. 14.8 శాతం వార్షిక వృద్ధితో 2030 నాటికి పరిశ్రమ విలువ రూ.5.3 లక్షల కోట్లకు చేరుతుంది. కొత్త కారుతో పోలిస్తే పాత వాహనం కొనుగోలు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 2020–21లో కొత్త వాహన వ్యవస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక మార్పులను చూసింది. అదే సమయంలో వినియోగదార్ల ప్రాధాన్యతలలో మార్పు పాత కార్ల మార్కెట్‌ను వృద్ధి మార్గంలో వేగంగా నడిపించింది. 

ప్రస్తుతం పాత కారు కొనేందుకు కస్టమర్లు ఎప్పుడూ లేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. చిన్న పట్టణాలు పరిశ్రమను ముందుకు నడిపిస్తాయి. మెట్రోయేతర ప్రాంతాల వాటా ప్రస్తుతమున్న 55–70 శాతానికి చేరుతుంది. కొత్త కార్లతో పోలిస్తే 2024–25 నాటికి పాత కార్ల మార్కెట్‌ రెండింతలు ఉండనుంది’ అని నివేదిక వివరించింది.

చదవండి: 2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

మరిన్ని వార్తలు