దేశముదుర్లు.. క్షణాల్లో నకిలీ ఆధార్‌ కార్డులు రెడీ | Sakshi
Sakshi News home page

దేశముదుర్లు.. క్షణాల్లో నకిలీ ఆధార్‌ కార్డులు రెడీ

Published Sat, Dec 25 2021 8:12 AM

Fake Aadhar Card Gang Arrested By Police Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఆధార్‌ ముఠా గుట్టు హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ రట్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్‌డీ డీసీపీ రాధాకిషన్‌ రావుతో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు. 
►  బోరబండ, న్యూ అల్లాపూర్‌కు చెందిన నితేష్‌ సింగ్, టోలిచౌకీకి చెందిన సయ్యద్‌ ముస్తఫా, ఓల్డ్‌ హఫీజ్‌పేటకు చెందిన షేక్‌ జహంగీర్‌ పాషా, హైదర్‌గూడకు చెందిన మహ్మద్‌ అన్వరుద్దీన్‌ స్నేహితులు. గోల్నాక తులసీనగర్‌కు చెందిన రబ్బాని ఎంఏ, హకీంపేటకు చెందిన మహ్మద్‌ అజహర్‌ షరీఫ్‌ ఇద్దరూ ముస్తఫాకు చెందిన ఎస్‌ఎం ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేసేవారు. బోరబండ ఎస్‌ఆర్టీ నగర్‌కు చెందిన మహ్మద్‌ సోహైల్‌ నితేష్‌ సింగ్‌కు చెందిన జేబీ ఎంటర్‌ప్రైజెస్‌లో పని చేసేవారు. 

►  లాక్‌డౌన్‌ తర్వాత ముస్తఫా వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇబ్బందులను మిగిలిన స్నేహితులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా నితేష్‌ సింగ్‌ తనకు మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో పవన్‌ అనే స్నేహితుడు ఉన్నాడని.. అతను అస్సాంలో ఆధార్‌ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద అస్సాంకు చెందిన ఆధార్‌ ఐడీ కార్డులు ఉన్నాయని, వాటిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో వారు వాటిని కొనుగోలు చేసి నగరంలో నకిలీవి సృష్టించి అవసరమైన అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం పన్నారు. 
►  గత అక్టోబర్‌లో నితేష్‌ పవన్‌ నుంచి రూ.90 వేలకు ఆరు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీలను కొనుగోలు చేసి మిగిలిన వారికి విక్రయించాడు. దీంతో ఈ నలుగురు ఆధార్‌ కిట్స్, ల్యాప్‌టాప్, ఫింగర్‌ ప్రింట్‌ స్లాబ్, కెమెరాలను కొనుగోలు చేసి తమ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ కేంద్రాల్లో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సేవలు ప్రారంభించారు. 

►  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక రాష్ట్రంలో జారీ చేసిన ఆధార్‌ కార్డులు ఆ రాష్ట్ర పరిధిలోనే వినియోగించాలి. అయితే నిందితులు హైదరాబాద్‌లో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేదా అప్‌డేషన్‌ కోసం అస్సాంకు కేటాయించిన కార్డులపై వివరాలను ముద్రించి నకిలీవి సృష్టించారు. ఇందుకోసం హైదరాబాద్, మేడ్చల్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్ల పేరుతో నకిలీ స్టాంప్‌లను సృష్టించారు. ఆయా గెజిటెడ్‌ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లను కూడా తయారు చేశారు. గత రెండు నెలలుగా ఆయా కేంద్రాల నుంచి సుమారు 3 వేల ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  
► నకిలీ ఆధార్‌ కార్డ్‌ల భాగోతం యూఐడీఏఐ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నితేష్‌ సింగ్, ముస్తఫా, రబ్బాని, అజహర్‌ షరీఫ్, సోహైల్, జహంగీర్‌ పాషా, అన్వరుద్దీన్‌లతో పాటు  మొరమ్మగడ్డకు చెందిన మహ్మద్‌ అహ్మద్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు భోపాల్‌కు చెందిన పవన్‌ పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.80 వేల నగదు,  ఆరు ఆధార్‌ కిట్లు, 5 స్టాంప్‌లు, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దరఖాస్తులు, ఫోర్జరీ బర్త్‌ సర్టిఫికెట్లు, ఫేక్‌ ఆధార్‌ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

చదవండి: వద్దంటే రెచ్చిపోయాడు, ముద్దులు పెడుతూ అసభ్యంగా తాకుతూ..


  

Advertisement

తప్పక చదవండి

Advertisement