క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను

10 Oct, 2022 05:59 IST|Sakshi

క్యూ2(జులై–సెప్టెంబర్‌) రిజల్ట్స్‌ సీజన్‌ షురూ

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సై

ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం

ఫెడ్‌ మినిట్స్, ముడిచమురు ధరలకూ ప్రాధాన్యం

ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్‌వేర్‌ సేవల నంబర్‌వన్‌ కంపెనీ టీసీఎస్‌ జులై–సెప్టెంబర్‌(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(12న), ఇన్ఫోసిస్‌(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్‌ కంపెనీ బజాజ్‌ ఆటో(14న), ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్‌ నెలకు రిటైల్‌ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్‌ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి.  

రూపాయి ఎఫెక్ట్‌
క్యూ2 ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్‌) సరఫరా కోతలతో బ్రెంట్‌ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్‌ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్‌ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్‌) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు.  

విదేశీ అంశాలు
అంతర్జాతీయంగా చూస్తే యూఎస్‌ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ గత పాలసీ మినిట్స్‌ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్‌ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు.

గత వారం
మూడు వారాల డౌన్‌ట్రెండ్‌కు చెక్‌ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్‌ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి.  

మరిన్ని వార్తలు