అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా..

7 Nov, 2023 17:06 IST|Sakshi

తెలుగు నటుడు రానా దగ్గుబాటి తన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియా సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఓ సమావేశంలో రానా మాట్లాడారు. ‘2005లో నా 18వ ఏటా స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీను ప్రారంభించాను. ఐదేళ్ల పాటు అందులో పనిచేశాను. ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా సినిమా తీయాలని భావించాను. కానీ అలా జరగలేదు. అయితే దాన్ని మొదట అత్యంత సృజనాత్మకంగా నిర్మించాలని అనుకున్నాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని నిర్వహణ ఖరీదైంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా అధునాతనమైనవి. దాంతో ఆ కంపెనీను మూసివేశాను. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని ప్రైమ్ ఫోకస్‌కి విక్రయించాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్లలో విడుదల కాలేదు. నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మకానికి ఉంచినపుడు నాకు బాధ అనిపించలేదు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం’అని అన్నారు. 

రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవర్ 170లో నటిస్తున్నారు. రానా విక్రయించిన స్పిరిట్ మీడియా 'కల్కి 2898 AD' సినిమా అంతర్జాతీయ మార్కెటింగ్ భాగస్వామిగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు