సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్లలో శక్తి కాంతదాస్‌

2 Sep, 2023 04:56 IST|Sakshi

గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌లో ‘ఏ ప్లస్‌’  రేటింగ్‌  

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రపంచవ్యాప్తంగా టాప్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌గా ర్యాంక్‌ పొందారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న  గ్లోబల్‌ ఫై నాన్స్‌ మ్యాగజైన్‌ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక ర్యాంకును అందించింది. గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్, 2023లో దాస్‌ ‘ఏ ప్లస్‌’  రేటింగ్‌ పొందారు. ‘ఏ ప్లస్‌’ రేటింగ్‌ పొందిన ముగ్గురు సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ల జాబితాలో దాస్‌ అగ్రస్థానంలో ఉన్నారు.

  దాస్‌ తర్వాతి వరుసలో స్విట్జర్లాండ్‌ గవర్నర్‌ థామస్‌ జె జోర్డాన్, వియత్నాం సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌ న్గుయెన్‌ థి హాంగ్‌ ఉన్నారు.  గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌  ప్రకటన ప్రకారం ద్రవ్యో ల్బ ణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేటు నిర్వహణలో విజయం తత్సంబంధ అంశాల స్కేల్‌పై ఆధారపడి సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లకు ‘ఏ’ నుంచి ‘ఎఫ్‌’ వరకూ ర్యాంకులను ఇవ్వడం జరుగుతుంది. ‘ఏ ప్లస్‌’ అద్భుత పనితీరు ను ప్రతిబింబిస్తే, పూర్తి వైఫల్యాన్ని ‘ఎఫ్‌’ సూచిస్తుంది.

రెండవ ప్రతిష్టాత్మక గుర్తింపు
లండన్‌ సెంట్రల్‌ బ్యాంకింగ్‌ అవార్డ్స్, 2023 జూన్‌లో దాస్‌కు ’గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రదానం చేసిన నేపథ్యంలోనే ఆయనకు తాజాగా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం గమనార్హం.  ద్రవ్యోల్బణంపై పోరు, డిమాండ్‌ పెరుగుదల, సప్లై చైన్‌కు అంతరాయం కలగకుండా చర్యలు వంటి పలు సవాళ్ల పరిష్కారానికి ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రభుత్వాలూ తమ సెంట్రల్‌ బ్యాంక్‌ల వైపు చూసినట్లు  మ్యాగజైన్‌ పేర్కొంది.

‘ఏ’  గ్రేడ్‌ పొందిన సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌లలో బ్రెజిల్‌కు చెందిన రాబర్టో కాంపోస్‌ నెటో, ఇజ్రాయెల్‌కు చెందిన అమీర్‌ యారోన్, మారిషస్‌కు చెందిన హర్వేష్‌ కుమార్‌ సీగోలం,  న్యూజిలాండ్‌కు చెందిన అడ్రియన్‌ ఓర్‌ ఉన్నారు. కొలంబియాకు చెందిన లియోనార్డో విల్లార్, డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన హెక్టర్‌ వాల్డెజ్‌ అల్బిజు, ఐస్‌లాండ్‌కు చెందిన అస్గీర్‌ జాన్సన్, ఇండోనేíÙయాకు సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ పెర్రీ వార్జియో ‘ఏ’ మైనస్‌ గ్రేడ్‌ పొందిన గవర్నర్లలో ఉన్నారు.

గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ 1994 నుంచి గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌ను ప్రచురిస్తోంది. యూరోపియన్‌ యూనియన్, ఈస్టర్న్‌ కరీబియన్‌ సెంట్రల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఆఫ్రికన్‌ స్టేట్స్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్రికన్‌ సహా 101 దేశాలు, భూభాగాలు, జిల్లాల గ్రేడ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌లకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకుల ప్రకటన జరుగుతోంది.

మరిన్ని వార్తలు