ఏఆర్‌సీల క్రమబద్ధీకరణకు ఆర్‌బీఐ కమిటీ సిఫార్సులు

3 Nov, 2021 06:28 IST|Sakshi

ముంబై: అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీల (ఏఆర్‌సీ) పనితీరును క్రమబద్ధీకరించే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ కమిటీ పలు సిఫార్సులు చేసింది. మొండి అసెట్స్‌ను విక్రయించేందుకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం, దివాలా కోడ్‌ ప్రక్రియలో పరిష్కార నిపుణులుగా వ్యవహరించేందుకు ఏఆర్‌సీలను కూడా అనుమతించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ. 500 కోట్లు పైబడిన ఖాతాల విషయంలో వాటిని విక్రయిస్తే వచ్చే విలువ, సముచిత మార్కెట్‌ ధరను బ్యాంకులు ఆమోదించిన ఇద్దరు వేల్యుయర్లతో లెక్క గట్టించాలని కమిటీ సూచించింది.

రూ. 100 కోట్లు –500 కోట్ల మధ్య అకౌంట్లకు ఒక్క వేల్యుయర్‌ను నియమించవచ్చని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్‌ చేయగలిగే అధికారాలు ఉన్న అత్యున్నత స్థాయి కమిటికే.. రిజర్వ్‌ ధరపై తుది నిర్ణయాధికారం ఉండాలని తెలిపింది. సంబంధిత వర్గాలు డిసెంబర్‌ 15లోగా ఆర్‌బీఐకి తమ అభిప్రాయాలు పంపాల్సి ఉంటుంది. ఇటు బాకీల రికవరీ, అటు వ్యాపారాలను పునరుద్ధరణ అంశాల్లో ఏఆర్‌సీల పనితీరు అంత ఆశావహంగా లేకపోతున్న నేపథ్యంలో వాటి పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ సేన్‌ సారథ్యంలో కమిటీ ఏర్పడింది.  

మరిన్ని వార్తలు