ఇకపై రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్లు

1 Jan, 2021 16:36 IST|Sakshi

2021లో కొత్తగా.. టెక్‌లైఫ్‌- 5జీ లీడర్‌ విజన్‌

వివిధ ధరల్లో 5జీ స్మార్ట్‌ ఫోన్లు విడుదలకు రెడీ

గతేడాదిలో స్మార్ట్‌ టీవీలు, స్మార్ట్‌ వాచీల ఆవిష్కరణ

న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో టెక్‌లైఫ్‌- 5జీ లీడర్‌ విజన్‌తో దేశీయంగా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు రియల్‌మీ తాజాగా పేర్కొంది. ఇటీవల కాలంలో కంపెనీ స్మార్ట్‌ఫోన్లతోపాటు.. పూర్తిస్థాయి టెక్నాలజీ బ్రాండుగా ఆవిర్భవిస్తున్నట్లు రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ తెలియజేశారు. విభిన్న స్మార్ట్‌ ఫోన్లతోపాటు స్మార్ట్‌ టీవీలు, ఆడియో, వేరబుల్‌ ప్రొడక్టులను మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పారు. తద్వారా రియల్‌మీ టెక్‌లైఫ్‌ను నిర్మించుకుంటున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా 2021లో కంపెనీ నుంచి మరిన్ని కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. చదవండి: (రియల్‌మీ నుంచి స్మార్ట్‌ వాచీలు రెడీ)

X7 సిరీస్‌ ఫోన్లు
రియల్‌మీ X7 బ్రాండుతో 5జీ ఆధారిత స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మాధవ్‌ వెల్లడించారు. వివిధ ధరలలో వీటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2021లో టెక్‌ లైఫ్‌స్టైల్ బ్రాండుగా వృద్ధి చేందే ప్రణాళకలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలువురికి దేశీయంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేశారు. రియల్‌మీ మాతృ సంస్థ చైనాకు చెందిన బీబీకే గ్రూప్‌కాగా..  2020లో దేశీయంగా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం విదితమే. గతేడాది 5 కోట్ల స్మార్ట్‌ ఫోన్ల విక్రయాలను అందుకోగా.. మే నెలలో స్మార్ట్‌ టీవీలను సైతం ప్రవేశపెట్టినట్లు  మాధవ్‌ వెల్లడించారు. ఈ బాటలో స్మార్ట్‌వాచీల విక్రయాలకూ తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. (2021లో రియల్‌మీ కీలక ఫోన్‌- కేవోఐ )

మరిన్ని వార్తలు