Reserve Bank of India: దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బైటపడ్డ ఐఓబీ

30 Sep, 2021 07:53 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్‌) నుంచి ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) బయటపడింది. బ్యాంక్‌ లావాదేవీలు, వ్యవస్థాగత, పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఐఓబీ మెరుగైన ఫలితాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

కనీస మూలధన నియమావళిని అనుసరించాలని కూడా ఐఓబీకి ఆర్‌బీఐ సూచించింది. 2015 నుంచీ ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో ఉంది. ఈ నెల ప్రారంభంలో యుకో బ్యాంక్‌ను ఈ పరిధి నుంచి ఆర్‌బీఐ తొలగించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ఇంకా పీసీఏ పరిధిలోనే కొనసాగుతుండడం గమనార్హం. 

కాగా ఐఓబీ 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.831 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షేర్‌ మార్కెట్‌ ముగిసిన తర్వాత ఐఓబీ దిద్దుబాటు చర్యల చట్రం పరిధి నుంచి బయటకు వచ్చిన ప్రకటన వెలువడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో బుధవారం ఐఓబీ షేర్‌ ధర 0.49 శాతం పెరిగి 20.45 వద్ద ముగిసింది.   

చదవండి: అక్టోబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవులు ఇవే

మరిన్ని వార్తలు