ఇది చరిత్రాత్మక నిర్ణయం: ప్రధాని మోదీ

3 Jul, 2021 13:07 IST|Sakshi

న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్పందించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోదీ అన్నారు. 

దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ట్వీట్‌ చేశారు. ఇక నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు.

అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్‌ఎంఈలకు వర్తించే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్‌ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.  తాజా నిర్ణయంతో ఆయా వర్గాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ నిన్న ట్వీట్‌ చేశారు.

తాజా మార్గదర్శకాలతో ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద 250 కోట్లపైగా టర్నోవర్‌ ఉన్న హోల్‌సేల్‌ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు త్వరగతిన ఫైనాన్స్‌ పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారు ఉద్యమ్‌ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు