-

రిటైల్‌ లీజింగ్‌ 15 శాతం అధికం

22 Aug, 2023 03:49 IST|Sakshi

జనవరి–జూన్‌ కాలంలో నమోదు

రియల్టీ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ నివేదిక

ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్‌ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ తెలిపింది. హోమ్‌వేర్, డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్‌ అండ్‌ అప్పారెల్‌ రిటైలర్ల నుంచి లీజింగ్‌కు డిమాండ్‌ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్‌ లీజింగ్‌ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.

క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్‌ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్‌వేర్, డిపార్ట్‌మెంట్‌ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్‌ అండ్‌ అప్పారెల్‌ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్‌ డీల్స్‌లో ముంబైలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌లో 20,800 ఎస్‌ఎఫ్‌టీ స్థలాన్ని కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్‌లో 13,500 ఎస్‌ఎఫ్‌టీని పాంటలూన్‌ లీజుకు తీసుకోగా, విశ్వరూప్‌ ఐటీ పార్క్‌లో 10,800 ఎస్‌ఎఫ్‌టీని క్రోమా తీసుకుంది.

దేశవ్యాప్తంగా 24 శాతం అప్‌
దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్‌ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, అహ్మదాబాద్‌ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్‌ లీజింగ్‌ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్‌ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మ్యాగజిన్‌ తెలిపారు. మాల్‌ సరఫరాకు తోడు, పండుగల సీజన్‌లో వినియోగ డిమాండ్‌ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్‌ లీజు పరిమాణం 5.5–6 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్‌ఈ ఎండీ రామ్‌ చంద్‌నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్‌ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. 

మరిన్ని వార్తలు