Insurance: బేసిక్‌ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం

22 Nov, 2021 00:05 IST|Sakshi

ఈ రైడర్లు..రక్షణదారులు

హెల్త్‌ ప్లాన్‌ ఒక్కటే చాలదు..

వాటికి అవసరమైన రైడర్లు జోడించుకోవాలి

జేబు నుంచి ఎక్కువ ఖర్చు తగ్గేది అప్పుడే

ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్‌ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది.

కానీ, బేసిక్‌ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్‌ హెల్త్‌ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం.

రైడర్‌ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్‌ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్‌ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్‌ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్‌ను తీసుకోవచ్చు.

లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్‌ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది.

రూమ్‌ రెంట్‌ వెయివర్‌
రూమ్‌ రెంట్‌ వెయివర్‌  రైడర్‌ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్‌ ప్లాన్లలో స్టాండర్డ్‌ లేదా సెమీ ప్రైవేటు రూమ్‌లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్‌ రెంట్‌ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్‌ రెంట్‌ వెయివర్‌ రైడర్‌తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు.

హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌
ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్‌ డైలీ క్యాష్‌ రైడర్‌ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్‌ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్‌ అవసరపడుతుంది.  

మెటర్నిటీ రైడర్‌
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్‌ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్‌ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్‌ పీరియడ్‌ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్‌ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్‌ను జోడించుకోవడం మంచిది.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్‌గా తీసుకోవడం మంచిది. కేన్సర్‌ లేదా స్ట్రోక్‌ లేదా హార్ట్‌ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి.

వీటిని బెనిఫిట్‌ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్‌ ఇల్‌నెస్‌తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్‌ ప్లాన్‌ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్‌ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్‌ప్లాన్‌తో పాటు తీసుకోవాలి.  

కన్జ్యూమబుల్స్‌ కవర్‌
ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్‌కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్‌ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్‌ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్‌ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్‌ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే.

వ్యక్తి ప్రమాద బీమా
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ మాదిరే పర్సనల్‌ యాక్సిడెంట్‌ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్‌ లేదంటే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ప్లాన్‌కు అనుబంధంగా ఈ రైడర్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్‌ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్‌ ఆదుకుంటుంది.  

ఓపీడీ కవరేజీ
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్‌ పెషెంట్‌గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్‌ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు.

ఎన్‌సీబీ ప్రొటెక్షన్‌
ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌ లేకపోతే నో క్లెయిమ్‌ బోనస్‌(ఎన్‌సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్‌ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్‌ చేసుకున్నా అప్పటికే ఎన్‌సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్‌ కాపాడుతుంది.

మరిన్ని వార్తలు