బాబ్బాబు.. మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లిస్తాం..!

10 Dec, 2021 04:17 IST|Sakshi

ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్‌ అనే హ్యూమనాయిడ్‌ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది!

ఫేస్‌ వాల్యూ.. ఫేస్‌ వాల్యూ అంటుంటారు కదా..మన ఫేస్‌కీ వాల్యూ ఇచ్చే రోజు వచ్చేసింది.‘మీ వయసు 25లోపు ఉందా? అందమైన ముఖవర్చస్సు మీ సొంతమా?అయితే మీలాంటి వారి కోసమే వెతుకున్నాం. కాస్త మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లలో భారీ నజరానా ఇస్తాం.’ అంటూ ‘నెట్టిం'ట్లో తాజాగా చక్కర్లు కొట్టిన ప్రకటన ఇది. ఈ విచిత్రమైన యాడ్‌కు ఔత్సాహికుల నుంచి స్పందన సైతం అనూహ్యంగానే వచ్చింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 వేల మందికిపైగా తమ ‘ముఖాలను’ ఇచ్చేందుకు సిద్ధమంటూ దరఖాస్తులు పంపారు! 

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్‌ అనే హ్యూమనాయిడ్‌ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! తమ ‘క్లయింట్ల’ కోరిక మేరకు ఉత్తర అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లోని వివిధ హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, ఎయిర్‌పోర్టుల్లో దాన్ని ‘పని’కి కుదర్చనుంది. ఇందుకోసం ఎవరైనా తమ ముఖాన్ని రోబో తయారీలో వాడుకునేందుకు ముందుకొస్తే ఏకంగా రూ. కోటిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది!! హ్యూమనాయిడ్‌ అసిస్టెంట్‌గా సేవలందించబోయే రోబోతో పర్యాటకులు మాటకలిపేలా ఆ ‘ముఖం’ కనిపించాలన్నదే షరతు అట! అలాంటి ముఖాన్ని శాశ్వతంగా రోబోపై ముద్రించేందుకు చట్టబద్ధంగా సమ్మతించిన వారికి ఈ బహుమానాన్ని ఇస్తామని కంపెనీ తెలిపింది. 

ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభించడంలో నెలకొన్న చట్టపరమైన జాప్యాన్ని అధిగమించేందుకు తమ క్లయింట్లు సరికొత్త రోబో రూపాన్ని కోరుకున్నారని, అందుకే ఈ వెరైటీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు కంపెనీ వివరించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదట. ఈ రోబో తయారీ కోసం ముందుగా మనిషి ముఖంతోపాటు శరీర 3డీ నమూనాను తీసుకొని కొలతలు తీసుకుంటారట. ఆపై ఆ వ్యక్తి 100 గంటలకు సమానమైన సంభాషణలను రికార్డు చేసి ఇవ్వాలట. చివరగా అపరిమిత కాలానికి తన ముఖాన్ని ప్రింట్‌ లేదా డిజిటల్‌ రూపంలో ఆ సంస్థ వాడుకునేలా నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలట. ఇవన్నీ సవ్యంగా సాగితే 2023లో ఈ సరికొత్త రోబో ప్రపంచానికి  తన ‘ముఖం’ చూపించనుంది.

మరిన్ని వార్తలు