రూపాయికీ బైడెన్ ‘జో’ష్

9 Nov, 2020 14:26 IST|Sakshi

బలహీనపడుతున్న డాలరు ఇండెక్స్

చైనీస్ యువాన్, న్యూజిలాండ్ డాలరు జోరు

రూపాయికి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల దన్ను

ముంబై: డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 46వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న వార్తలతో డాలరు ఇండెక్స్ నీరసిస్తోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండు నెలల కనిష్టానికి చేరింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 74 దిగువన 73.96 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో రూపాయి 73.84 దిగువకు బలపడింది. ప్రస్తుతం 17 పైసల లాభంతో 74.03 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన రూపాయి 18 పైసలు జమ చేసుకుని 74.20 వద్ద ముగిసింది. 

బ్యాంకుల సపోర్ట్
జో బైడెన్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా తిరిగి వాణిజ్యం ఊపందుకునే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు ఇప్పటికే అమెరికన్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్  సరళతర మానిటరీ విధానాలకు సిద్ధమని ప్రకటించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాల కారణంగా వాణిజ్య ఆధారిత కరెన్సీల కొనుగోలుకి ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడినట్లు తెలియజేశారు. ప్రధానంగా చైనీస్ యువాన్ 28 నెలల గరిష్టాన్ని తాకగా.. న్యూజిలాండ్ డాలరు 19 నెలల గరిష్టానికి చేరింది. కాగా.. దేశీ స్టాక్ మార్కెట్లో ఇటీవల విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో  రూపాయి బలపడుతున్నట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. ఈ  నెల తొలి 5 రోజుల్లో నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు