భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్‌

12 Dec, 2022 10:15 IST|Sakshi

నవంబర్‌లో భారత్‌కు 9.09 లక్షల బీపీడీ ఎగుమతి  

న్యూఢిల్లీ: భారత్‌కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వరుసగా రెండో నెలా నవంబర్‌లోనూ రష్యా అగ్రస్థానంలో నిల్చింది. ఎనర్జీ ఇంటెలిజెన్స్‌ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రోజుకు 9.09 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) ముడి చమురును సరఫరా చేసింది. అక్టోబర్‌లో ఎగుమతి చేసిన 9.35 లక్షల బీపీడితో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినా.. మిగతా దేశాల ద్వారా వచ్చిన క్రూడాయిల్‌తో పోలిస్తే అధికంగానే ఉంది. (గుడ్‌న్యూస్‌..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు)

సాధారణంగా భారత్‌కు చమురు సరఫరా చేయడంలో ఇరాక్, సౌదీ అరేబియా అగ్రస్థానాల్లో ఉంటాయి. కానీ తాజాగా నవంబర్‌లో మాత్రం ఇరాక్‌ నుంచి 8.61 లక్షల బీపీడీ, సౌదీ అరేబియా నుండి 5.70 లక్షల బీపీడీ చమురు మాత్రమే దిగుమతయ్యింది. 4.05 లక్షల బీపీడీతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో కేవలం 0.2 శాతం స్థాయిలో ఉండేవి. (‘క్రోమా’ వింటర్‌ సీజన్‌ సేల్‌..బంపర్‌ ఆఫర్లు)

కానీ ప్రస్తుతం భారత చమురు సరఫరాల్లో అయిదో వంతుకు పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం దరిమిలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే ముడి చమురును అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో రష్యా క్రూడాయిల్‌ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. (ఎన్‌డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్‌)

మరిన్ని వార్తలు