సెయిల్‌ డివిడెండ్‌ రూ. 2.25

25 May, 2022 02:18 IST|Sakshi

క్యూ4లో రూ. 2,479 కోట్లు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్‌ దిగ్గజం సెయిల్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 2,479 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,450 కోట్లు ఆర్జించింది.

ఇందుకు పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 23,533 కోట్ల నుంచి రూ. 31,175 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 18,829 కోట్ల నుంచి రూ. 28,005 కోట్లకు భారీగా పెరిగాయి. మార్చికల్లా రుణ భారం రూ. 13,400 కోట్లుగా నమోదైనట్లు సెయిల్‌ వెల్లడించింది.

తాజా సమీక్షా కాలంలో 4.6 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగా.. 4.71 ఎంటీ అమ్మకాలను సాధించింది. 2020–21 క్యూ4లో స్టీల్‌ ఉత్పత్తి 4.56 ఎంటీకాగా.. 3.43 ఎంటీ విక్రయాలు నమోదయ్యాయి. కోకింగ్‌ కోల్‌ తదితర ముడివ్యయాల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో వ్యయాల అదుపునకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది.  
ఫలితాల నేపథ్యంలో సెయిల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 74 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు