Pull and Push Train: పుల్‌ అండ్‌ పుష్‌ ట్రైన్‌ అంటే ఏమిటి?

21 Oct, 2023 13:55 IST|Sakshi

భారతదేశంలో ప్రస్తుతం రవాణా రంగంలో నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణ రైళ్లను ఆధునీకరిస్తున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి.  ర్యాపిడ్ రైలు ప్రారంభం కానుంది. బుల్లెట్ రైళ్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ భారత్‌ పుల్‌ అండ్‌ పుష్‌ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

పుల్‌ అండ్‌ పుష్‌ రైళ్ల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. భారతదేశపు మొట్టమొదటి పుల్-పుష్ రైలును నవంబర్ నెలలో బీహార్ రాజధాని పాట్నా, మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య నడపనున్నారని సమాచారం. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రైళ్ల వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచడమే రైల్వేల లక్ష్యం. ఈ నేపధ్యంలో పుల్ అండ్ పుష్ రైళ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మీడియాకు అందిన వివరాల ‍ప్రకారం పుల్ అండ్‌ పుష్ రైళ్ల కోచ్‌లు ఈ నెలలోనే సిద్ధం కానున్నాయి. కాగా ఈ రైళ్లను ఎప్పుడు, ఎక్కడి నుంచి నడపాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఈ రైలుకు రెండు ఇంజన్లు అమర్చడం విశేషం. ఈ రైలుకు ముందు ఒక ఇంజన్, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. రైలులో జనరల్, స్లీపర్ క్లాస్‌ల చొప్పున మొత్తం 22 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో ఈ రైలు నాన్-ఏసీగా నిర్వహించనున్నారు.

ఈ రైలు కోసం పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో ప్రత్యేక కోచ్‌లను సిద్ధం చేశారు. ఈ డబుల్ ఇంజిన్ రైలులో ఒకసారి ఒక ఇంజిన్ మాత్రమే నడుస్తుంది. పుల్ అండ్ పుష్ టెక్నాలజీని ఉపయోగించడం వలన రైలు వేగాన్నిపెంచవచ్చు . అలానే తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ కారణంగా రైళ్ల సగటు వేగం 10 నుంచి 15 శాతం పెరుగుతుందని రైల్వేశాఖ చెబుతోంది. కొన్ని మార్గాల్లో ఈ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా నడవనుందని తెలుస్తోంది. ఈ రైలుకు ‘వందే జనసాధారణ’ అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు