మరింత పారదర్శకంగా బైబ్యాక్‌

18 Nov, 2022 04:42 IST|Sakshi

ప్రస్తుత 6 నెలల గడువులో కోత

ఓపెన్‌ మార్కెట్‌ విధానానికి స్వస్తి

పన్ను విధింపుపైనా సవరణలు

సెబీ తాజా ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్‌ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు తాజా ప్రతిపాదనలతో చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా బైబ్యాక్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా, వాటాదారులకు మద్దతిచ్చే బాటలో చేపట్టే చర్యలకు తెరతీసింది. వీటి ప్రకారం గరిష్ట పరిమితిలో కోతతోపాటు, బైబ్యాక్‌ పూర్తిచేసే గడువును భారీగా తగ్గించనుంది. బైబ్యాక్‌లో షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 15 శాతానికి మించకుండా ఫ్రీ రిజర్వుల ద్వారా బైబ్యాక్‌ను చేపట్టేందుకు వీలుంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి 10 శాతానికి కుదిస్తోంది. ఆపై ఏడాది 5 శాతానికి, తదుపరి పరిమితిని పూర్తిగా ఎత్తివేయనుంది. ఇక టెండర్‌ మార్గంలో బైబ్యాక్‌కు ప్రస్తుతమున్న 25 శాతం పరిమితిని 40 శాతానికి పెంచనుంది. ప్రస్తుతం బైబ్యాక్‌ పూర్తికి ఆరు నెలల గడువు లభిస్తోంది. అయితే ఈ గడువులో కృత్రిమంగా డిమాండును సృష్టించడం ద్వారా షేర్ల ధరలను ప్రభావితం చేసేందుకు అవకాశముంటున్నదని సెబీ పేర్కొంది. దీంతో గడువులో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రతిపాదనలపై సెబీ డిసెంబర్‌ 1వరకూ పబ్లిక్‌ నుంచి సూచనలు కోరుతోంది.

22 రోజులకు పరిమితం
తాజా ప్రతిపాదనల ప్రకారం 2023 ఏప్రిల్‌ నుంచి బైబ్యాక్‌ గడువును 66 పనిదినాలకు కుదించనుంది. ఆపై 2024 ఏప్రిల్‌ నుంచి 22 రోజులకు తగ్గించనుంది. ఈ బాటలో 2025 ఏప్రిల్‌ నుంచి ఓపెన్‌ మార్కెట్‌ విధానానికి స్వస్తి పలకనుంది. స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్‌ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75 శాతం వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. అంతేకాకుండా గడువులో సగం రోజులు ముగిసేసరికి కనీసం 40 శాతం సొమ్మును షేర్ల కొనుగోలుకి వెచ్చించవలసి ఉంటుంది. యాక్టివ్‌గా ట్రేడయ్యే షేర్లలోనే బైబ్యాక్‌ను చేపట్టవలసి ఉంటుంది.

కంపెనీ నికరంగా రుణరహితమై ఉంటే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు బైబ్యాక్‌ చేపట్టేందుకు అనుమతిస్తారు. అయితే ఇందుకు ఆరు నెలల కనీస గడువును పాటించడంతోపాటు టెండర్‌ మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఇక బుక్‌ బిల్డింగ్‌ పద్ధతిలో ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌లకు ప్రమోటర్లు, సహచరులు పాల్గొనేందుకు అనుమతించరు. బైబ్యాక్‌పై పన్ను విధింపును కంపెనీకి బదులుగా సంబంధిత వాటాదారులకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం బైబ్యాక్‌లో పాలుపంచుకోని వాటాదారులపై పన్ను భారం పడుతున్నందున తాజా సవరణలకు సెబీ ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు