స్టాక్ మార్కెట్లలో బుల్​ జోష్..కొనసాగుతున్న లాభాల పరంపర

30 Dec, 2022 06:53 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలను గడించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఊగిలాటతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. అయితే చివరి గంటలో టెలికం, బ్యాంకింగ్, మెటల్‌ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల గడువు గురువారం ముగిస్తుండటంతో ట్రేడర్లు తమ పొజిషన్లను షార్ట్‌ కవరింగ్‌ చేసుకున్నారు. 

 చైనాలో కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్‌ డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో ధరలు క్షీణించడం మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 732 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 224 పాయింట్లు లాభపడి 61,134 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 237 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్‌ ముగిసేసరికి 68 పాయింట్లు పెరిగి 18,191 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్లను విక్రయించాయి. చైనా బీజింగ్‌లో జీరో కోవిడ్‌ పాలసీ ఎత్తివేతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.  

కేఫిన్‌ టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ అంతంతే 
ఆర్థిక సేవల ప్లాట్‌ఫాం కెఫిన్‌ టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.366)తో పోలిస్తే ఒకశాతం ప్రీమియంతో రూ.369 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.372 వద్ద గరిష్టాన్ని, రూ.351 కనిష్టాన్ని తాకింది. చివరికి అరశాతం నష్టంతో రూ.364 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు