స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత.. ప్రారంభ లాభాలు ఆవిరి

18 Aug, 2021 13:58 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఉదయం రికార్డు స్థాయి లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ మధ్యాహ్నం సమయానికి నష్టాల పాలైంది. కరోనా కేసులు పెరుగుడంతో పాటు సామాజిక వ్యాప్తి జరుగుతుందంటూ న్యూజిల్యాండ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు కుదుపు లోనయ్యాయి. యూఎస్‌, ఏషియా మార్కెట్‌లలో అస్థిరత నెలకొంది. దాని ప్రభావం దేశీ మార్కెట్‌లపై కూడా కనిపించింది. దీంతో ఉదయం లాభాలను అందించిన సూచీలు మధ్యాహ్నం సమయానికి నష్టాల దిశలో ఉన్నాయి. మార్కెట్‌ ముగిసే సమయానికైనా దేశీ సూచీలు కొలుకుంటాయా లేదా అనే సందిగ్థత ఇన్వెస్టర్లలో నెలకొంది.

భారీ తేడా
ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ రాకెట్‌ వేగంతో పైకి దూసుకెళ్లింది. ఓ దశలో గరిష్టంగా 56,118 పాయింట్లను తాకింది. తొలిసారిగా 56 వేలను క్రాస్‌ చేసింది. ఇదే జోరు కొనసాగుతుందనే దశలో ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెట్టారు. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 90 పాయింట్లు నష్టపోయి 55,701 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గరిష్ట , కనిష్ట పాయింట్ల మధ్య తేడా ఏకంగా 501 పాయింట్లు ఉండటం మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతకు అద్దం పడుతోంది. మరోవైపు ఉదయం లాభాలు అందించి ఏకంగా 16,700 పాయింట్లను క్రాస్‌ చేసిన నిఫ్టీ సైతం 33 పాయింట్లు నష్టపోయి 16,580 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఇక్కడ కూడా గరిష్ట, కనిష్ట పాయింట్ల మధ్య తేడా 233 పాయింట్లుగా ఉంది. 

మరిన్ని వార్తలు