పురి.. వారసుడొచ్చాడు!

5 Aug, 2020 04:38 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త చీఫ్‌ శశిధర్‌ జగ్‌దీశన్‌

ఆదిత్యపురి స్థానంలో నియామకం

ఆర్‌బీఐ ఆమోదముద్ర

అక్టోబర్‌ 27 నుంచి బాధ్యతలు

ముంబై: ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఈఓ అండ్‌ ఎండీ)గా శశిధర్‌ జగ్‌దీశన్‌ నియమితులయ్యారు. ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్‌ నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మంగళవారం తెలిపింది. అక్టోబర్‌ 27 నుంచీ మూడేళ్లపాటు జగ్‌దీశన్‌ ఈ బాధ్యతల్లో ఉంటారు.  

25 యేళ్ల అనుబంధం 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో గత 25 సంవత్సరాలుగా జగ్‌దీశన్‌ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. బ్యాంక్‌లో అత్యుత్తమ రీతిలో ‘స్ట్రేటజిక్‌ చేంజ్‌ ఏజెంట్‌’గా పనిచేస్తున్న ఘనత ఆయనకు ఉంది. ఇండియన్‌ బ్యాంకింగ్‌ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్‌దీశన్‌ ఒకరు. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– సోమవారం సాయంత్రం మొత్తం మూడు పేర్లను ఆమోదం నిమిత్తం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డ్‌ ఆర్‌బీఐకి పంపింది. ఇందులో జగ్‌దీశన్‌ పేరు బ్యాంక్‌ బోర్డ్‌ మొదటి ప్రాధాన్యతలో ఉంది.

హోల్‌సేల్‌ లెండింగ్‌ చీఫ్‌ కజాద్‌ బారూచా, సిటీ కమర్షియల్‌ బ్యాంక్‌ సీఈఓ సునీల్‌ గార్గ్‌లు బ్యాంక్‌ బోర్డ్‌ ఆర్‌బీఐకి పంపిన జాబితాలో మరో రెండు పేర్లు. జర్మన్‌ బ్యాంక్‌ డాయిష్‌ బ్యాంక్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్‌దీశన్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫైనాన్స్‌ శాఖలో మేనేజర్‌గా చేరారు. 1999లో ఫైనాన్స్‌ విభాగం బిజినెస్‌ హెడ్‌ అయ్యారు. 2008లో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్‌ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి ‘చేంజ్‌ ఏజెంట్‌’గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. 

బ్యాంక్‌ లాభాల బాట... 
ఆదిత్యపురి సుదీర్ఘ బాధ్యతల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎన్నో విజయాలు సాధించింది. ఇన్వెస్టర్లకు విశ్వసనీయ బ్యాంక్‌గా మార్కెట్‌క్యాప్‌ రూ.5.71 లక్షల కోట్లకుపైగా చేరింది. మొండిబకాయిల భారం భారీగా పెరిగిపోకుండా పటిష్ట నియంత్రణలు ఇక్కడ చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాల పురి పదవీ కాలంలోని  తొలి పదేళ్లలో బ్యాంక్‌ 30 శాతంపైగా లాభాల వృద్ధిని నమోదుచేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో ఈ శాతం 20కి తగ్గింది. ఈ ఏడాది జూన్‌ నాటికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ 15.45 లక్షల కోట్లు. ఇందులో రూ.10 లక్షల కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియో ఉంది. బ్యాం క్‌కు ప్రస్తుతం ఉన్న నాన్‌–బ్యాంక్‌ అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ త్వరలో లిస్ట్‌కానుంది.   పురి బాధ్య తలు అక్టోబర్‌ 26తో ముగుస్తాయనీ, తరువాతి రోజు నుంచీ జగ్‌దీశన్‌ ఆ చైర్‌లోకి వస్తారనీ స్టాక్‌ ఎక్సే్చంజీలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది.  

సవాళ్లున్నాయ్‌... 
బ్యాంక్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక సవాళ్లు జగ్‌దీశన్‌కు ఎదురుకానున్నాయి. అనిశ్చితి ఆర్థిక వాతావరణంలో బ్యాంక్‌ నిర్వహణ ఇందులో మొదటిది. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో గత లాభాల బాటలో కొనసాగడానికి బ్యాంక్‌ కొత్త వ్యాపార వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్‌ వాహన ఫైనాన్స్‌ బిజినెస్‌లో అసమంజస రుణ విధానాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే పలువురు ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపులు, బదిలీలు జరిగాయి. ఈ తరహా ఆందోళనలను జగ్‌దీశన్‌ పూర్తిస్థాయిలో నివారించాల్సి ఉంటుంది.  

దూసుకుపోయిన షేర్‌... 
కొత్త సీఈఓ నియామకం పట్ల ఇన్వెస్టర్లలో హర్షం వ్యక్తమైంది. మంగళవారం బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌  3.94 శాతం (రూ.39.45) ఎగసి రూ.1,041కి చేరింది. 

హర్షణీయం...
ఈ నియామకం నాకు సం తోషాన్ని ఇచ్చింది. చేంజ్‌ ఏజెంట్‌గా నియమితులైననాటి నుంచీ ఆయనతో నేను ఎంతో సన్నిహితంగా పనిచేశాను. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని శక్తిసామర్థ్యాలు, నైపుణ్యత శశిధర్‌ జగదీశన్‌కు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అత్యుత్తమ వ్యక్తి చేతుల్లో ఉందని భావిస్తున్నాను. మరిన్ని విజయాలు సాధిస్తారని విశ్వసిస్తున్నాను. – ఆదిత్యపురి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా