‘దివా’తో మరెన్నో ప్రయోజనాలు..

26 Mar, 2024 12:00 IST|Sakshi

మహిళల అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ మహిళల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్‌తో ఓ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పిల్లల నుంచి మహిళలు, సీనియర్ సిటిజన్స్ వరకు అన్ని వర్గాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కొన్ని సర్వీసులను తీసుకొస్తాయి. అలా మహిళా వినియోగదారుల కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఇటీవల ‘దివా’ పేరుతో ఓ ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయో బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

దివా క్రెడిట్ కార్డ్ 18 నుంచి 70 ఏళ్ల వయసులోని మహిళలకు కేటాయిస్తారు. వారి కనీస సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలుగా ఉండాలి. ఆదాయ రుజువు లేనిపక్షంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ భద్రతపై కూడా ఈ దివా కార్డును జారీ చేస్తారు. దీని నుంచి యాడ్ఆన్ కార్డులను కూడా మహిళలకే అందిస్తారు.  దరఖాస్తు సమయంలో శాలరీ స్లిప్, ఫామ్‌ 16, ఐటీ రిటర్నులతో పాటు పాన్, ఆధార్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ కార్డు ద్వారా ఏడాదికి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లను పొందవచ్చు. వార్షిక రక్త పరీక్షలతో కూడిన హెల్త్ ప్యాకేజీని పొందే వీలుంది. ఈ కార్డును రూపే నెట్‌వర్క్‌లో జారీ చేయడంతో వివిధ వ్యాపార ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, యూపీఐ బెనిఫిట్స్ వర్తిస్తాయి. రూ.100 గరిష్ఠ మొత్తంతో 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్‌ రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. 24/7 ట్రావెల్, హోటల్ రిజర్వేషన్లు, కన్సల్టెన్సీ సేవలపై రాయితీలు పొందవచ్చు.

లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్‌కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్‌ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో స్పెషల్ డిస్కౌంట్ కూడా లభించనున్నట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2కు సమానమైన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కార్డు వార్షిక రుసుము రూ.499 కాగా.. ఓ ఏడాదిలో 30 వేలు ఖర్చు చేస్తే అది కూడా మినహాయిస్తారు.

ఇదీ చదవండి: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్‌ ప్లాన్ల పెంపు..? ఎంతంటే..

Election 2024

మరిన్ని వార్తలు