ఎస్‌యూవీలతో పర్యావరణ ముప్పు

3 Mar, 2023 04:36 IST|Sakshi

బెర్లిన్‌: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్‌యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్‌ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) 100 కోట్ల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను వెదజల్లాయి.

ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్‌ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్‌తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్‌యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్‌యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్‌ దూసుకెళ్లింది.

2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్‌యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్‌ నాన్‌–ఎస్‌యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మార్కెట్‌తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్‌ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. 

మరిన్ని వార్తలు