కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!

15 Jun, 2023 09:09 IST|Sakshi

Swiggy Delivery Boy: ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఏసీ గదుల్లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఏదో కారణాలు చెబుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వారు చేసే ఉద్యోగం చిన్నదైనా.. ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేసే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'సాహిల్ సింగ్'. ఇంతకీ ఈ సాహిల్ సింగ్ ఎవరు? అతనికొచ్చిన కష్టమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సాహిల్ సింగ్ మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత నింజాకార్ట్‌లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్‌లో కూడా పనిచేశాడు. అయితే దేశంలో అధికంగా కరోనా మహమ్మారి సమయంలో తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ స్విగ్గిలో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు.

ఇటీవల ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్న 'ప్రియాన్సీ చాందెల్' అనే మహిళ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చిన తరువాత మెట్లపైన ఆయాసపడుతూ కూర్చున్నప్పుడు ఆమె ఏమైందని పలకరించింది. అప్పుడతడు.. మేడమ్, ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేసాను. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు మా ఫ్లాట్‌మేట్‌కి అవసరం ఉన్నాయంటే ఇచ్చాను.

(ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్‌కి ఇది కదా శుభవార్త - ఈ ఆఫర్స్‌తో పండగ చేసుకోండి!)

నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ నేను గ్రాడ్యుయేట్‌ చేసాను. ఇప్పటికే నింజాకార్ట్‌, బైజూస్‌లో కొద పనిచేసాను. ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే వస్తాయని, అందులోనూ కస్టమర్ ఇచ్చిన టైమ్ లోపల డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా సరిగ్గా తిండి తిని వారం రోజులైందని, కేవలం టీ.. వాటర్‌తో గడిపేస్తున్నాని, అమ్మానాన్న వయసు కూడా పెరుగుతోందని ఇప్పుడు కూడా వారిపై ఆధారపడటం ఇష్టం లేదని, కనీసం నెలకు 25 వేలు సంపాదించాలనుందని, ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాడు. 

(ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో)

ఇదంతా విన్న ప్రియాన్సీ చాందెల్ అతడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్ వంటి వాటిని కూడా యాడ్ చేసింది. ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ లాంటి ఏదైనా జాబ్ దయచేసి చెప్పండని రిక్వెస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అతనికి డబ్బు సహాయం కూడా చేసారు, మరి కొంతమంది ఫుడ్ ఆర్డర్ కూడా చేశారు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చేసింది. సాహిల్‌కి ఉద్యోగం లభించిందని ప్రియాన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

మరిన్ని వార్తలు