స్విగ్గీకి మరో షాక్‌.. వేరుకుంపటికి సిద్ధమైన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌!

3 Nov, 2023 19:12 IST|Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గురుమూర్తి కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించి తన సొంత వెంచర్‌ను ప్రారంభించబోతున్నారని ఈ పరిణామాలు తెలిసిన వ్య​క్తులను ఉటింకిస్తూ ‘మనీకంట్రోల్‌’ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. 

గత మార్చిలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఏర్పాటు చేసిన గురుమూర్తి.. కొన్ని రోజులు తెరమరుగై మళ్లీ మే నెలలో స్విగ్గీ మాల్‌కు అధిపతిగా తిరిగి వచ్చారు. స్విగ్గీ మాల్‌ను గతంలో స్విగ్గి మ్యాక్స్ అని పిలిచేవారు. ఇది హైపర్‌లోకల్ ఆన్‌లైన్ షాపింగ్ విభాగం. కార్తీక్‌ గురుస్వామి ప్రారంభించనున్న వెంచర్ ఇప్పుడు స్విగ్గీ నిర్వహిస్తున్నలాంటిదే. అయితే ఇది ఆఫ్‌లైన్ స్పేస్‌లో ఉంటుంది. జర్మనీకి చెందిన సూపర్‌మార్కెట్‌ చైన్‌ ఆల్డీ లాంటి చవక ధరల భౌతిక దుకాణం మోడల్‌ను కార్తీక్‌ గురుస్వామి భారత్‌లో ప్రారంభించనున్నారు.

కొన్ని నెలల క్రితం గురుమూర్తి తన వెంచర్ కన్వెనియోకు నిధుల కోసం మ్యాట్రిక్, యాక్సెల్ వంటి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలను కలిశారు. ఈ వెంచర్‌ పేరునే ఆయన మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై గురుమూర్తి కానీ, స్విగ్గీ, మ్యాట్రిక్, యాక్సెల్ కంపెనీలు కానీ స్పందించలేదు. కాగా స్విగ్గీ మాల్‌కు అధిపతిగా దీపక్ కృష్ణమణిని నియమించింది. దీన్నిబట్టి గురుమూర్తి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో స్విగ్గీలో చేరిన కృష్ణమణి అంతకుముందు అమెజాన్‌లో దాదాపు ఏడేళ్లు, దానికిముందు మారికోలో తొమ్మిదేళ్లు పనిచేశారు.

వరుస నిష్క్రమణలు
స్విగ్గీలో టాప్-లెవల్ నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జాబితాలో గురుమూర్తి కూడా చేరనున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేల్ వాజ్ కూడా తన సొంత వెంచర్‌ను ప్రారంభించడానికి నిష్క్రమించారు. 

కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, ఇన్‌స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే కంపెనీ విడిచిపెట్టిన కొన్ని రోజులకే మే నెలలో వైస్ ప్రెసిడెంట్, బ్రాండ్ అండ్‌ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆశిష్ లింగంనేని కూడా కంపెనీని వీడారు. అదేవిధంగా, రెవెన్యూ అండ్‌ గ్రోత్‌ విభాగాన్ని నిర్వహించే సీనియర్‌ వైస్‌ ప్రెసిడెండ్‌ అనూజ్ రాఠి కూడా ఫిన్‌టెక్ కంపెనీ జూపిటర్‌లో చేరేందుకు స్విగ్గీ నుంచి నిష్క్రమించారు.

మరిన్ని వార్తలు