100 ఏళ్లు మన్నికయ్యే రంగులు

25 Mar, 2022 06:19 IST|Sakshi

తయారీలోకి టెక్నో పెయింట్స్‌

ఇటలీ సంస్థ రియాల్టో సహకారం

ప్లాంటుకు రూ.150 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ టెక్నో పెయింట్స్‌ లైమ్‌ ఆధారిత  ఇటాలియన్‌ ఫినిషెస్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది.  వారసత్వ కట్టడాలకు లైమ్‌ ఆధారిత పెయింట్స్‌ను వాడతారని, 100 ఏళ్లకుపైగా మన్నికగా ఉండడం వీటి ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది.  రసాయనాలు లేకుండా సహజ ఖనిజాలు, వర్ణ ద్రవ్యాలతో వీటిని తయారు చేస్తారు.

  ఖరీదైన భవంతులు, విల్లాలకూ ఈ రంగుల వినియోగం పెరుగుతోందని కంపెనీ వివరించింది. లైమ్‌ ఆధారిత రంగుల తయారీ భారత్‌లో లేదని, కొన్ని కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయని తెలిపింది. చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.150–400 మధ్య ఉంటుంది. లైమ్‌ ప్లాస్టర్స్, డెకోరేటివ్‌ ఫినిషెస్, వెనీషియన్‌ ప్లాస్టర్స్, మెటాలిక్‌ స్టకోస్‌ సైతం కంపెనీ విక్రయించనుంది.

ఆర్డర్‌ బుక్‌ రూ.600 కోట్లు..: ఇటలీ కంపెనీ రియాల్టోతో టెక్నో పెయింట్స్‌ సాంకేతిక సహకారం కుదుర్చుకుంది. లైమ్‌ ఆధారిత ఫినిషెస్‌ను తొలుత దిగుమతి చేసుకుంటామని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.  

‘అమ్మకాలు పెరిగిన తర్వాత వీటిని ఉత్పత్తి చేస్తాం. రియాల్టో సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన డిజైనింగ్‌ ఫినిషెస్‌ను తయారు చేస్తున్నాం.  హైదరాబాద్‌ సమీపంలోని పటాన్‌చెరు వద్ద ఉన్న కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం ఒక లక్ష మెట్రిక్‌ టన్నులు. తొలి దశలో రూ.75 కోట్లు వెచ్చించాం. ప్లాంటు వినియోగం 2023 మార్చికల్లా 100 శాతానికి చేరుతుంది. 2023–24లో మరో రూ.75 కోట్లు ఖర్చు చేస్తాం. తద్వారా సామర్థ్యం రెండింతలు అవుతుంది.  ఆర్డర్‌ బుక్‌ రూ.600 కోట్లు ఉంది’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు