రుణ అర్హత పెంచుకోవడానికి మార్గలివే

23 Aug, 2021 08:29 IST|Sakshi

దేశంలో సగం మంది స్వయం ఉపాధిలో ఉన్న వారే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడ్డవారే ఉంటారు. వీరు రెండు విభాగాలుగా ఉంటారు. ‘సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ప్రొఫెషనల్స్‌’ అంటే ఏదో విభాగంలో నైపుణ్యం ఉన్న వారు. వీరికి ఏదో ఒక విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా ఉంటుంది. మెడికల్‌ ప్రాక్టీషనర్స్, డెంటిస్ట్‌లు, చార్టర్డ్‌ అకౌంటెంట్‌లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు ఇలాంటి వారిని సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ప్రొఫెషనల్స్‌గా పేర్కొంటారు. ప్రత్యేక నైపుణ్యాల్లేకుండా ఉపాధి ఏర్పాటు చేసుకున్న వారు నాన్‌ ప్రొఫెషనల్స్‌ విభాగంలోకి వస్తారు. ప్రధానంగా వీరు హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారం, ట్రేడింగ్‌ తదితర పనుల్లో ఉంటుంటారు. రెండో విభాగం ఎక్కువగా అసంఘటిత రంగం కిందకే వస్తుంది. చిన్న పట్టణాల్లో వీరి ప్రాతినిధ్యం బలంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్థుల వృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు ఎన్నో తీసుకున్నాయి. అయినప్పటికీ సొంత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు రుణం పొందాలంటే నిపుణులు కాని స్వయం ఉపాధిలోని వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి వారు రుణ అర్హతలను పెంచుకునే మార్గాలు చూద్దాం.. 

రుణానికి అడ్డంకులు.. 
 - నెలవారీ అస్థిర ఆదాయం ఉండడం
 - క్యాష్‌ రూపంలో ఆదాయం చూపించే రుజువులు లేకపోవడం 
 - వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లేకపోవడం. ఉదాహరణకు ఎస్టాబ్లిష్‌మెంట్‌ లైసెన్స్, వ్యాట్‌ రిజిస్ట్రేషన్, ఇతర లైసెన్స్‌లు 
- రుణ చరిత్ర లేకపోవడం లేదా పరిమితంగా ఉండడం. లేదంటే ప్రతికూల చరిత్ర ఉండడం. 
 -  పన్ను రిటర్నుల చరిత్ర లేకపోవడం
 -  కేవైసీకి సంబంధించి అసంపూర్ణ డాక్యుమెంట్‌లు
 - ఖాతాల నిర్వహణ సజావుగా లేకపోవడం

ఇటువంటివి రుణ అర్హతలకు ప్రతికూలతలుగా భావించాలి. దీంతో రుణాలిచ్చే సంస్థలకు.. రుణ గ్రహీత చరిత్రను సమగ్రంగా తెలుసుకుని, రుణ అర్హతను అంచనా వేయడం కష్టమవుతుంది. రుణాలిచ్చే సంస్థలకు ఈ విభాగం పెద్ద సవాళ్లతో కూడుకున్నదే. దీంతో రుణ పరపతి తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దరఖా స్తు ప్రాసెసింగ్‌ కూడా ఆలస్యమవుతుంది. అంతేకాదు దరఖాస్తు తిరస్కరణకు కూడా గురికావచ్చు. అందుకనే స్వయం ఉపాధిలోని వారు వ్యాపారం, ఆదాయానికి సంబంధించి వీలైనన్ని డాక్యుమెంట్లను సమర్పించడం మంచిది. తద్వారా వేగంగా రుణాలను పొందేందుకు మార్గం సులువవుతుంది. ఇందుకోసం చేయాల్సినవి ఏవిటంటే..?

రుణ అర్హతలను పెంచేవి.. 
 - వ్యాపార ఖాతాలను ఎటువంటి తప్పుల్లేకుండా, కచ్చితంగా నిర్వహించాలి. అంతేకాదు ఆయా అకౌంట్లను చార్టర్డ్‌ అకౌంటెంట్లతో ఆడిట్‌ కూడా చేయించుకోవాలి. 
- ఆదాయపన్ను రిటర్నులను సమయానికి కచ్చితంగా దాఖలు చేయాలి. 
- వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 
- వ్యాపారంలో భాగంగా వచ్చే ఇతర ఆదాయానికి రుజువులను కూడా దగ్గర ఉంచుకోవాలి. రుణ దరఖాస్తు అధికారి కోరిన ప్రతీ సమాచారంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలి. దీనివల్ల మీ గురించి, మీ వ్యాపారం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు పడుతుంది. 
- మీకు సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి తీసుకునే ఏ రుణంలో అయినా చెల్లింపుల్లో వైలఫ్యం, జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌హిస్టరీపై ప్రభావం పడకుండా ఉంటుంది. 
 

చదవండి : బంగారం రుణాల్లోకి షావోమీ !

మరిన్ని వార్తలు