డీమ్యాట్‌ నామినీ నమోదు గడువు పెంపు 

27 Sep, 2023 01:00 IST|Sakshi

డిసెంబర్‌ చివరి వరకు అవకాశం 

న్యూఢిల్లీ: డీమ్యాట్‌ ఖాతాదారులు నామినేషన్‌కు సంబంధించి తమ ఎంపికను తెలియజేసేందుకు గడువును సెబీ డిసెంబర్‌ చివరి వరకు పొడిగించింది. వాస్తవానికి అయితే ఈ నెల 30తో ఈ గడువు ముగుస్తోంది. ప్రస్తుత డీమ్యాట్‌ ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించి నామినీ నమోదు లేదంటే నామినీ నిలిపివేయడం ఏదో ఒక ఆప్షన్‌ ఇవ్వడం తప్పనిసరి. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్‌ ఖాతాలకు నామినేషన్‌ ఎంపికను స్వచ్ఛందం చేస్తున్నట్టు సెబీ ప్రకటించింది.

ట్రేడింగ్‌ ఖాతాలకు ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఇన్వెస్టర్ల అభీష్టానికే విడిచిపెట్టింది. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు, డిపాజిటరీలు, బ్రోకర్ల అసోసియేషన్‌లు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ట్రేడింగ్‌ ఖాతాలకు నామినేషన్‌ను స్వచ్ఛందం చేసినట్టు సెబీ తెలిపింది. డీమ్యాట్‌ ఖాతాలకు సంబంధించి నామినేషన్‌ ఎంపిక గడువును డిసెంబర్‌ 31వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఇక ఫిజికల్‌గా షేర్లు కలిగిన వారు తమ ఫోలియోలకు సంబంధించి పాన్, నామినేషన్, కాంటాక్ట్‌ వివరాలు, బ్యాంక్‌ ఖాతా, స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ (సంతకం)ను డిసెంబర్‌ 31 వరకు ఇవ్వొచ్చని సెబీ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు