టీటీఎఫ్‌ హైదరాబాద్‌ 2022: ఘనంగా ప్రారంభం

5 Jul, 2022 17:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రావెల్ అండ్‌ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్‌)హైదరాబాద్‌- 2022 రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రారంభించారు.  హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా  సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.  

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ మాట్లాడుతూ 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి  వచ్చిన టూరిజం ప్రతినిధులు టూరిజం ప్రచారంలో భాగంగా టూరిజం స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటకాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారన్నారు. కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 

రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజంప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిని సీఎం నేతృత్వంలో   చేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్, కేసీఆర్‌ ఎకో పార్క్, అతిపెద్ద జలపాతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెం డేళ్లనుంచి పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్‌ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు