Noida Twin Towers: ఇంకా పేలుడు పదార్థాలు కావాలి.. అప్పుడే ఆ పని చేయగలం!

10 May, 2022 14:11 IST|Sakshi

దేశ వ్యాప్తంగా రియల్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోయిడా ట్విన్‌టవర్స్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితుల ప్రభావమో లేక ఉద్దేశ పూర్వకంగానో కాదంటే తెర వెనుక ఏదైనా శక్తులు నడిపిస్తున్నాయో తెలియదు కానీ సుప్రీం కోర్టు ఉత్తర్వులు సైతం ఈ కేసులో సకాలంలో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 


నిబంధనలు తుంగలో తొక్కి నలభై అంతస్థుల భవనాలు నిర్మించారని, వీటిని కూల్చివేయాలంటూ సుప్రీం కోర్టు నోయిడా ట్విన్‌ టవర్స్‌ కేసులో తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఇక్కడ అపార్ట్‌మెంట్ల కోసం డబ్బులు కట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలంటూ నిర్మాణ సంస్థ సూపర్‌టెక్‌ను ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం 2022 మే 22న  జంట భవనాలు కూల్చేయాల్సి ఉంది.

మాట మార్చారు
ఈ పనులను ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ జెట్‌ డెమోలిషన్‌ సంస్థలు దక్కించుకున్నాయి. కోర్టు తీర్పును అనుసరించి ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత కోసం 2022 ఏప్రిల్‌ 10న టెస్ట్‌ బ్లాస్ట్‌ నిర్వహించాయి. ఇక అక్రమ భవంతుల కూల్చివేత ఒక్కటే మిగిలిందనే తరుణంలో మరింత సమయం కావాలని కూల్చివేత పనులు దక్కించుకున్న ఎడిఫైస్‌ సంస్థ కోరుతోంది. 

ఇంకా కావాలి
మొదటగా పది అంతస్థుల్లో పేల్చివేత చేయాలని నిర్ణంయిచామని కానీ ఇప్పుడు బేస్‌మెంట్‌తో సహా కూల్చివేయక తప్పదని ఎడిఫైస్‌ సంస్థ అంటోంది. దీని కోసం పేలుడు పదర్థాలు ఎక్కువగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. మారిన ప్రణాళిక వల్ల అవసరమైన పేలుడు పదార్థాలు మొత్తం 2.4 టన్నుల నుంచి 3,3 టన్నులకు పెరిగిందని పేర్కొంది. అంతేకాకుండా కాలమ్స్‌కి జియో టెక్స్‌టైల్స్‌ క్లాత్‌ అమర్చబోతున్నట్టు చెప్పింది.

ఆగష్టు 28న ఓకే
ప్లాన్‌లో మార్పులు చోటు చేసుకున్నందున ముందుగా నిర్ధేశించినట్టుగా మే 22న కూల్చివేత చేయడం సాధ్యం కాదని, కాబట్టి గడువును 2022 ఆగష్టు 28 వరకు పొడిగించాలని ఎడిఫైస​ సం‍స్థ నోయిడా అథారిటీకి లేఖ రాసింది. ఈ కొత్త ప్రతిపాదనలపై నోయిడా అధికారులు గుర్రుగా ఉన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మే 22న కూల్చివేత పనులు చేపట్టకపోవడం ఒప్పంద ఉల్లంఘన కింద పరిగణిస్తామంటూ హెచ్చరించారు.

ఏం జరగబోతుంది
సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి మే 22న కూల్చివేత చేపట్టడం మా వల్ల కాదంటోంది ఎక్స్‌పోజివ్‌ సంస్థ. ఇప్పటికే జంట భవనాల కేసులో అనేక తప్పిదాలకు నోయిడా అధికారులు పాల్పడినట్టు సుప్రీం గుర్తించింది. తాజాగా కూల్చివేత గడువును కూడా అమలు చేయకపోవడం నోయిడా అధికారులకు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగాలంటే మరోసారి న్యాయస్థానం జోక్యం తప్పేట్టుగా లేదు.

చదవండి: 40 అంతస్థుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతలో మరో ట్విస్ట్‌!

మరిన్ని వార్తలు