యుద్ధ భయం.. యూకేలో ఉక్రెయిన్‌ బిజినెస్‌మేన్‌ అనుమానస్పద మృతి!

4 Mar, 2022 10:42 IST|Sakshi


రష్యా ఏకపక్షంగా చేపట్టిన యుద్ధం కారణంగా తమ భవిష్యత్తు ఎలా ఉంటోందోననే భయం రష్యన్‌ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే అనేక మంది తమ వ్యాపారాలను అందిన కాడికి అమ్మేస్తున్నారు. ఈ తరుణంలో యూకేలో ఓ ఉక్రెయిన్‌ వ్యాపారి అనుమానస్పదంగా మరణించడం సంచలనంగా మారింది.

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వివిధ దేశాలతో భారీ ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్న సోవియట్‌ కుబేరులు.. తాజా పరిణామాలతో బెంబెలెత్తిపోతున్నారు. ఈ దేశం ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటుందో.. తమ భవిష్యత్తు ఏమైపోతుందనే అనే సందేహాలు వారిని చుట్టుముడుతున్నాయి.

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగమైన ఉక్రెయిన్‌లో 1995లో జన్మించాడు మిఖైల్‌ వాట్‌ఫోర్డ్‌. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్‌ను వీడి యూకేలోని లండన్‌లో సెటిల్‌ అయ్యాడు. గ్యాస్‌, ఆయిల్‌ సరఫరా బిజినెస్‌తో ధనవంతుడయ్యాడు. ఆ తర్వాత తన మకాంని లండన్‌ నుంచి సర్రే కౌంటీకి మార్చాడు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన మరుసటి రోజే సర్రేలోని తన ఇంటిలో ఆయన శవమయ్యాడు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మిఖైల్‌ మరణానికి యుద్ధానికి సంబంధం ఉండకపోవచ్చని యూకే అధికార వర్గం వాదిస్తోంది.

అయితే మిఖైల్‌ సన్నిహితులు మాత్రం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి మిఖైల్‌ని తీవ్రంగా కలచివేసందంటున్నారు. అతని మరణానికి స్పష్టమైన కారణాలు తాము వివరించలేకపోయినా.. యుద్ధం తదనంతర పరిస్థితులు అతని ఆలోచనలను కచ్చితంగా ప్రభావితం చేశాయంటున్నారు. యుద్ధం మొదలైన మరుసటి రోజే ఆరోగ్యంగా మిఖైల్‌ అకస్మాత్తుగా చనిపోవడం యాదృచ్ఛికం కాదంటున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత రష్యాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఇన్నర్‌ సర్కిల్‌లో ఉన్న వ్యాపారవేత్తలను పశ్చిమ దేశాలు టార్కెట్‌ చేశాయి. వారి వ్యాపార సామ్రాజ్యం ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక మిఖైల్‌ విషయానికి వస్తే యూకే తయారు చేసిన పుతిన్‌ ఇన్నర్‌ సర్కిల్‌ వ్యాపారవేత్తల జాబితాలో అతని పేరు లేదని తెలుస్తోంది. కానీ యుద్ధతదనంతర పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచన మిఖైల్‌ మరణానికి కారణమనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

చదవండి: పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్‌ బిలియనీర్లు

మరిన్ని వార్తలు